Friday, April 19, 2024

ఏపీ సచివాలయంలో కరోనా ప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా బారిన పడి మరో ఇద్దరు ఉద్యోగులు చనిపోయారు. శనివారం ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన విషాదం నుంచి సహచరులు తేరుకోకముందే సోమవారం మరో ఇద్దరు కన్నుమూశారు. పంచాయతీరాజ్‌శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ వి.శాంతికుమారి (50), హోంశాఖ రికార్డు అసిస్టెంట్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తి (45) కరోనాతో చనిపోయారు. శనివారం మృతి చెందిన ఆర్థిక శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ వి.పద్మారావు భార్యే శాంతికుమారి. భర్త చనిపోయిన 2రోజుల వ్యవధిలోనే భార్య మృతి చెందడంపై సహచరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణయిన వారిలో 40 మందికిపైగా హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వరుస మరణాలు, పెరుగుతున్న కేసులతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి సోమవారం వచ్చిన అధికారుల్లో ఎక్కువ మంది కరోనా భయంతో వ్యక్తిగత వాహనాల్లో రావడంతో సచివాలయ ప్రాంగణంలో కార్ల సంఖ్య భారీగా కనిపించింది. సచివాలయంలోని మూడో బ్లాకులో సోమవారం పదుల సంఖ్యలో సందర్శకులు కనిపించారు. గనులు అక్రమంగా తవ్వారన్న అభియోగాలపై అధికారులు విధించే అపరాధ రుసుములపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద అప్పీల్‌ చేసుకోవడానికి వీరంతా వచ్చారు. దీంతో మంత్రి పేషీ సందర్శకులతో హడావుడిగా కనిపించింది.

ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నందున రొటేషన్‌ పద్ధతిలో వారం చొప్పున ఇళ్ల నుంచి పని చేసే వెసులుబాటునివ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. సందర్శకులను పూర్తిగా నిలిపేసి గతంలో మాదిరి రోజూ సచివాలయాన్ని శానిటైజ్‌ చేయాలని సూచించారు. ‘వర్క్‌ ఫ్రం హోం’ అవకాశమివ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం అధికారులకు ఉద్యోగులు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఇంటి నుంచి విధులు నిర్వహించడానికి అవకాశమివ్వాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు కూడా డిమాండ్‌ చేశారు. పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోతే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిని కార్యాలయాలకు పిలిపించి, మిగిలిన వారికి ఇంటినుంచే విధులకు అవకాశమివ్వాలని కోరారు. కొవిడ్‌తో బాధపడుతూ సచివాలయంలో 3 రోజుల్లో నలుగురు, సీసీఎల్‌ఏలో ఒకరు మరణించారని.. ఇంకా బయటపడని మరణాలూ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) వర్తించే ఆసుపత్రుల్లో పడకల్లేవని చెబుతుండడంతో బాధితులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో పడకలు కేటాయించాలని కోరారు. వైరస్‌ బాధిత ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్‌ సెలవులనివ్వాలని విన్నవించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం సచివాలయం రెండో బ్లాక్‌లో వివిధ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement