Wednesday, October 9, 2024

Floods | బీహార్‌లో వరద బీభత్సం… బద్దలైన ఆరు బ్యారేజీలు

ఆంధ్రప్రభ స్మార్ట్​, బిహార్​: బీహార్‌లో తీవ్రమైన వరద సంక్షోభం నెలకొంది. ఎగువన ఉన్న నేపాల్‌లో కురుస్తున్న వర్షాల ప్రభావం బీహార్‌పై పడింది. ముఖ్యంగా ఇండో – నేపాల్‌ సరిహద్దు సమీపంలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మౌలిక సదుపాయాలు, వ్యవసాయ భూములుకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీహార్‌ రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. మూడు రోజులుగా ఎగువన ఉన్న నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ వరదంతా దిగువన బిహార్‌ రాష్ట్రంలోని నదుల్లోకి వచ్చి చేరింది.

దీంతో రాష్ట్రంలో వరదల సంభవించాయి. కోసి, గండక్‌, బాగ్మతి సహా ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం ఆరు బ్యారేజీలు బద్దలవడంతో సమీపంలోని గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.

తెగిపోయిన బాగ్మ‌తి న‌ది క‌ర‌క‌ట్ట‌..

సీతామర్హి జిల్లాలో కనీసం నాలుగు చోట్ల బాగ్మతి నది కరకట్ట తెగిపోయింది. పశ్చిమ చంపారన్‌, షెయోహర్‌ జిల్లాల్లో కట్టలు కూడా తెగిపోయాయి. పశ్చిమ చంపారన్‌లోని గండక్‌ నది ఉద్ధృతితో వాల్మీకి టైగర్‌ రిజర్వ్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది.

ముజఫర్‌పూర్‌లోని పవర్‌ గ్రిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో ఏ క్షణంలోనైనా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవచ్చని అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. అదే జరిగితే దాదాపు 43 వేల మంది అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

- Advertisement -

తూర్పు చంపారన్‌, గోపాల్‌ గంజ్‌, అరారియా, సుపాల్‌, కతిహార్‌, పూర్నియా సహా పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 22 ఎస్‌డీఆర్‌ఎప్‌ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement