Saturday, April 20, 2024

వరద బీభత్సం.. దారుణంగా మారిన పాక్‌ పరిస్థితి!

పాకిస్తాన్‌లో వరద బీభత్సం మనదేశంపై ప్రత్యక్ష ప్రభావం చూపకపోయినా, సరిహద్దున ఉన్న భారత్‌లోని రాష్ట్రాల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా రాజస్థాన్‌,గుజరాత్‌, రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగాఉంది.పాకిస్తాన్‌ ఒకప్పుడు భారత్‌లో అంతర్భాగం. పాక్‌ మన దేశంతో కయ్యం పెట్టుకోకుండా ఉంటే మన దేశం చొరవ తీసుకుని సాయమందించేందుకు ముందుండేది. ఇప్పుడైనా దాయాది దేశాల్లో వాతావరణ పరిస్థితులు మన చరిత్ర మాదిరిగానే ఒకేవిధంగా ఉన్నాయి. వందేళ్ళలో కనీవినీ ఎరుగని రీతిలో పాకిస్తాన్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి పాక్‌లో సంభవించిన వర్షాలు, వరదలు అనూహ్యమైన రీతిలో నష్టాన్ని కలిగించాయి. ఈ ఏడాది పాక్‌ దక్షిణ ప్రాంతమైన సింధ్‌, బలోచిస్తాన్‌లలో వర్షాలు దంచేస్తున్నాయి. దేశంలో మూడింట ఒక వంతు భాగం నీటిలో మునిగి ఉంది. కర్బన్‌ ఉద్గారాల విడుదలలో పాక్‌ ఎనిమిదవ స్థానంలోనూ, భారత్‌ ఏడవ స్థానంలోనూ ఉన్నాయి.

జూన్‌ నుంచి ఇంతవరకూ పాక్‌లో సంభవించిన వర్షాలు, వరదల్లో 12వందల మంది మరణించారు. వీరిలో మూడింట ఒక వంతుమంది పిల్లలు. వేలాది మంది గాయపడ్డారు. దేశంలోని 160 జిల్లాల్లో 110 జిల్లాలు వర్షబీభత్సంలో చిక్కకుకున్నాయి. ఈ జిల్లాల్లో 8లక్షల పశుగణం కొట్టుకుని పోయింది. ఈ పశవుల్లో ఎక్కువగా బలూచిస్థాన్‌కి చెందినవి. పదిలక్షలు పైగా ఇళ్ళు ధ్వంసమయ్యాయి. పాక్‌లో ఇళ్ళల్లో అధిక భాగం మట్టితో కట్టినవే. ఇవన్నీ కొట్టుకుని పోయాయి. ఐదువేల కిలోమీటర్ల పొడవున రహదారులు, లెక్కకు మిక్కిలిగా వంతెనలు దెబ్బతిన్నట్టు జాతీయ విపత్తు నివారణ సంస్థ అంచనా వేసింది. దేశంలోని ఇరవై లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, వరదల ప్రభావానికి గురయ్యాయి. నిరాశ్రయులైన వారిలో వేలాది మంది శిశువులు, గర్భిణులు ఉన్నారు. వీరికి రక్షిత మంచినీరు లభించడం లేదు. బలూచిస్థాన్‌కు దేశంలో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్డు, రైలు మార్గాలుదెబ్బతిన్నాయి. బలూచిస్థాన్‌లో ఏరియల్‌ సర్వే జరిపిన ఆర్మీ హెలికాప్టర్లు కూలి వందమంది మరణించారు.

ఈ వరదల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు సొంత అజెండాల ప్రకారం పని చేస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రానున్న ఎన్నుకల కోసం తాపత్రపడుతున్నారు తప్ప వర్షాలు, వరదలలో చిక్కుకున్న వారికి సాయం అందించే విషయంలో శ్రద్ధ కనబర్చడం లేదు. ఫెడరల్‌ ప్రభుత్వం ఒక్కటే ఈ వరదల విషయం లో శ్రద్ధ తీసుకుంటోంది. అనేక అంతర్జాతీయ సహాయక సంస్థలు బాధితులకు సాయం అందించడంలో చేయి కలుపుతున్నాయి. అంతర్జాతీయ సహాయక సంస్థల నుంచి పాకిస్తాన్‌కు సాయం అందుతుందో లేదో స్పష్టంగా తెలియడం లేదు. అంతకుముందే అంతర్జాతీయ ఆర్థిక సహాయక సంస్థల నుంచి పాక్‌ దొరికినంత సాయాన్ని అందుకుంది. అన్ని దేశాలూ ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఆర్థికంగా మందగమనంలో ఉన్నాయి. అంతేకాక, ఇతర దేశాలతో పాక్‌ సంబంధాలను బట్టి కూడా సాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నందున పాకిస్తాన్‌ను ఏ దేశమూ నమ్మడంలేదు. భారత్‌పై పాక్‌ పాలకులు ఎంత విషం చిమ్ముతున్నా దాయాది దేశం ఎన్నడూ లేని రీతిలో కష్టాల కడలిలో చిక్కుకోవడంతో భారత్‌ సాయపడుతోంది.

పాక్‌ కోరిన సాయాన్ని అందించేందుకు సిద్ధ పడుతోంది. యూరప్‌, చైనా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తుంటే, పాకిస్తాన్‌ వర్షబీభత్సంలో చిక్కుకోవడం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫెడరల్‌ ప్రభుత్వం అనుసరించిన, అనుసరిస్తున్న విధానాల వల్ల పాకిస్తాన్‌ ఇప్పటికే దివాళా తీసే స్థితిలో ఉంది. ఇప్పుడు వర్ష, వరద బీభత్సం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. పాకిస్తాన్‌కి ఇంతవరకూ సాయపడుతూ వచ్చిన చైనా తీవ్ర దుర్భిక్షం, కొన్నిప్రాంతాల్లో కరోనా కారణంగా పాక్‌కి సాయం అందించే స్థితిలో లేదు. పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి గోరుచుట్టుపై రోకటిపోటులా ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement