Tuesday, April 23, 2024

ఫ్లెక్సీ వార్.. నిన్న అర‌వింద్ పైనా.. నేడు బి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : నిజామాబాద్ లో ఫ్లెక్సీ వార్ కొన‌సాగుతుంది. నిన్న ఎంపీ అర‌వింద్ కు వ్య‌తిరేకంగా ఫ్లెక్సీలు వెలువ‌గా.. నేడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిర‌స‌న‌గా నిజామాబాద్ పార్లమెంట్ అంతటా ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం మాట ఇస్తే తల నరుక్కుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పడంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీల‌లో క‌నిపించాయి. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీ అమలయ్యేదెన్నడు?, ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూంలు ఎక్కడ? అని ప్ర‌శ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తానన్న నెలకు 3016 రూపాయలు ఎక్కడ?, కనీసం ఎంతమందికి ఇవ్వాలన్నా లెక్కలైనా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?, ఓవైపు టీఎస్పీఎస్సీ నిర్వాకంతో ఉద్యోగాలు రాక, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగ భృతి అందక యువకులు ఇబ్బంది పడుతున్న బాధ‌ను తెలిపేలా ఉన్నాయి. 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానన్న ఎన్నారై సెల్ ఎక్కడా? అని ప్రశ్నిస్తున్న గల్ఫ్ కార్మికులు, లక్ష రూపాయల రుణమాఫీ, ఉచిత ఎరువుల పంపిణీ అమలయ్యేదెప్పుడు అంటున్న రైతులు, దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు హామీ ఏమైంది అని ప్రశ్నిస్తున్న దళిత సోదరులు ఇలా నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

మొత్తం మీద నిన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు ఫ్లెక్సీల‌తో నిర‌స‌న సెగ త‌గ‌ల‌గా.. నేడు సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. మొత్తం మీద నిజామాబాద్ లో ఫ్లెక్సీ వార్ కొన‌సాగుతున్న‌ద‌ని తెలుస్తోంది. అక్క‌డి రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై ప్ర‌భుత్వం స్పందిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement