Tuesday, April 16, 2024

ముందు సంప్రదింపులు, అభిప్రాయాలు, ఆ తర్వాతే అభిప్రాయం.. ఈసీ ఆల్ పార్టీ మీటింగ్‌లో పార్టీల వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వలస కార్మికులు సహా స్వస్థలాలకు సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజలు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిన ‘రిమోట్ ఓటింగ్ మెషీన్‌’ (ఆర్వీఎం)పై వివిధ రాజకీయ పార్టీలు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల పనితీరుపైనే ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలున్నాయని, ఈ పరిస్థితుల్లో నేరుగా ఎవరినీ సంప్రదించకుండా ఆర్వీఎం ను తెరపైకి తీసుకురావడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. దేశంలోని గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలతో పాటు 57 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలను సోమవారం ఢిల్లీకి ఆహ్వానించి ఆర్వీఎం పనితీరుపై డెమో ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇందుకు ఒక రోజు ముందుగానే (ఆదివారం) కాంగ్రెస్ నేతృత్వంలో జేడీ(యు), శివసేన, సీపీఐ, సీపీఐ(ఎం), నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా మొత్తం 16 పార్టీలు సమావేశమై ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనను ముందే తోసిపుచ్చాయి. లోపభూయిష్టంగా ఉన్న ఈసీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పాయి. అయితే ఈసీ ఆహ్వానం మేరకు సోమవారం నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమ ప్రతినిధులను పంపించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ మాత్రమే హాజరైంది. వైఎస్సార్సీపీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలు మాత్రం ఎవరినీ పంపించలేదు.

- Advertisement -

సమావేశంలో రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎం) గురించి సాంకేతికాంశాలతో అఖిలపక్ష నేతలందరికీ అర్థమయ్యేలా చెప్పాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ భావించారు. అయితే సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులు ఆర్వీఎంపై డెమో చూసేందుకు ఆసక్తి చూపకపోగా.. ముందు తమ అభిప్రాయాలు నమోదు చేసుకోవాలని పట్టుబట్టారు. ఆ తర్వాతే డెమో చూస్తామని తేల్చిచెప్పాయి. దీంతో ఎన్నికల సంఘం పార్టీల ప్రతినిధుల ఒత్తిడి తలొగ్గి వారందరి అభిప్రాయాలను నమోదు చేసుకుంది.

వలస కూలీలపై లెక్కలు తేలాలి.. సంప్రదింపుల తర్వాతే ఆర్వీఎం : తెలుగుదేశం

ఈసీ అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. “ఏ ఒక్క ఓటరు ఓటుహక్కుకు దూరం కావొద్దు” అన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనకు తాము అనుకూలమేనని, అయితే ఆ అంశాన్ని పరిష్కరించేందుకు ఎన్నికల సంఘం అనుసరించిన విధానమే సరిగా లేదని ఆయన తెలిపారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించకుండా రిమోట్ ఓటింగ్ మెషీన్ తయారు చేశారని, దాన్ని తమ ముందు పెట్టి అభిప్రాయాలు చెప్పమంటున్నారని ఆయనన్నారు.

ఏదైనా సరే సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన తర్వాతనే జరగాలని ఆయన వెల్లడించారు. ఇదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అందుకే ఆల్ పార్టీ మీటింగులో అన్ని పార్టీలు ముందు తమ అభిప్రాయాలు చెప్పేందుకే పట్టుబట్టాయని, దీంతో డెమో మరోసారి నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే జనవరి 31 లోగా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలన్న డెడ్‌లైన్ కూడా మార్చాల్సి ఉంటుందని ఆయనన్నారు.

మరోవైపు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న వలస కూలీల కోసమే ఈ విధానాన్ని ప్రతిపాదించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోందని, సగటున ఓటుకు దూరంగా ఉంటున్నవారు 30 శాతం వరకు ఉన్నారని ఈసీ చెబుతోందని కేశవ్ అన్నారు. అయితే ఇందులో వలస కార్మికులు ఎంత శాతం అన్న లెక్కాపత్రం లేదని అన్నారు. దీనిపై ఏదైనా శాస్త్రీయ అధ్యయనం చేశారా అని తాము ఈసీని ప్రశ్నించినట్టు పయ్యావుల చెప్పారు.

గత కొన్నాళ్లుగా ఎన్నికల పోలింగ్ శాతాన్ని గమనిస్తే.. యువత, పట్టణాల్లోని ధనిక, ఎగువ మధ్యతరగతి వర్గాలే ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయని, వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లి మరీ ఓటేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్న వర్గాల్లో అవగాహన కల్పించి ఓటేసేలా కార్యక్రమాలు చేపట్టాలని పయ్యావుల కేశవ్ సూచించారు. ప్రతి ఒక్కరికీ ఓటేసే అవకాశం కల్పించడం ఎంత ముఖ్యమో, రిమోట్ ఓటింగ్ మెషీన్‌పై నెలకొన్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement