Saturday, April 20, 2024

నిప్పుల కొలిమి.. పల్నాడు జిల్లా రావిపాడులో 45.6 డిగ్రీల నమోదు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ప్రచండ భానుడి ప్రతాపానికి వడగాల్పులు తోడవ్వడంతో జనం అల్లాడి పోయారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఎండల తీవ్రత సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్న సమయానికి రోడ్లు నిర్మానుషంగా మారాయి. శనివారం పల్నాడు జిల్లా రావిపాడు 45.6, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పేరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పేదమేరంగిలో 45.5 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 20 మండలాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

రాష్ట్రంలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు- విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ఆదివారం అల్లూరి జిల్లాలోని చింతూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు తీవ్రవడగాల్పులు, 135 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 8 తీవ్రవడగాల్పులు, 268 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్‌ కాకుండా ఉండటానికి క్షా, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

రేపు ఈ ప్రాంతాల్లో ఎండల తీవ్రత

నేడు (ఆదివారం) విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 – 45 ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 – 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 – 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement