Friday, March 29, 2024

సినీ పెద్దలకే సినిమా చూపించిన ప్రేక్షకులు!

హీరో.. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా టిక్కెట్టు, తినుబండారాల రేట్లు పెంచి ‘నిలువు దోపిడీ’ సినిమా చూపించిన పెద్దలకు.. ప్రేక్షకులు ఎదురు సినిమా చూపించారు. కథ అడ్డం తిరగడంతో పునరాలోచనలో పడ్డ సినీ ప్రముఖులు ఒక్కొక్క మెట్టు దిగుతున్నారు. ధియేటర్లు, మల్టిఫ్లెక్స్‌లను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినీ పెద్దలకు క్రమేపీ ప్రేక్షకులకు గట్టిగానే షాక్‌ ఇచ్చారు. కొత్త సినిమాలకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతూ.. ధియేటర్లలో తినుబండారాలకు ఎమ్మార్పీతో సంబంధం లేకుండా కొన్నేళ్లుగా ఇష్టారాజ్యం నడుస్తోంది. అధికారులు సైతం వీరి జోలికి వెళ్లేందుకు సాహసించే పరిస్తితి లేదు. ఇప్పటి వరకు ఓపిగ్గా భరించిన ప్రేక్షకులు క్రమేపీ ధియేటర్లకు రావడం మానేశారు. ఎంతలా అంటే ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు చూసేందుకు ధియేటర్ల వద్ద క్యూ కట్టిన ప్రేక్షకులు.. అసలు రెండో రోజు నుంచే ధియేటర్‌ ముఖం చూసేందుకు కూడా రావడం మానేశారు. కొందరు హీరోలకైతే తొలి రోజు మొదటి రెండు ఆటల తర్వాతనే ప్రేక్షకులు కరువయ్యారు. ఎలాగూ ఆ సినిమాలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఓటీటీల్లో వస్తాయి కాబట్టి ప్రేక్షకులు కూడా కొద్ది రోజులు ఆగుదాంలే అనే ధోరణికి వచ్చేశారు. పరిస్థితి తల్లకిందులై అసలుకే మోసం రావడంతో సినీ పెద్దలు పునరాలోచనలో పడ్డారు.

ఇదే పరిస్థితి కొనసాగితే ధియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారి సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కోవాల్సి రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు ప్రేక్షకులను పాత రోజుల్లో మాదిరి ధియేటర్లకు రప్పించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టారు. క్షేత్రస్థాయి ఎగ్జిబిటర్‌ మొదలు డిస్ట్రిబ్యూటర్లు, సినీ ప్రముఖులు, నిర్మాతలు.. ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితోనూ విస్తృత చర్చలు సాగించారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిందట భారీ బడ్జెట్‌ సినిమాలు మినహా ఇతర సినిమాలకు రేట్లు పెంచబోమంటూ ప్రకటించి తొలి మెట్టు దిగారు. అయినప్పటికీ ప్రేక్షకులు వీరి ప్రకటనలను పరిగణలోకి తీసుకోలేదు. మరోసారి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మల్టిఫ్లెక్స్‌ ధియేటర్లలో తినుబండారాల రేట్లు తగ్గించనున్నట్లు పేర్కొంటూ రెండో మెట్టు దిగారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులకు ఇంకా మరికొన్ని తాయిలాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రోజుల్లో మల్టిఫ్లెక్స్‌ల్లో టిక్కెట్లు రేట్లు, తినుబండారాల రేట్లు నియంత్రణలో ఉండటంతో ప్రేక్షకుల ఆదరణ కూడా పెరిగింది. రోజు రోజుకూ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో అంతే స్థాయిలో టిక్కెట్టు రేట్లు పెంచుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో కాంబో ఆఫర్‌ వంటి రకరకాల ఆఫర్లతో తినుబండారాల రేట్లను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. ఎంతలా అంటే నలుగురున్న కుటుంబ సభ్యులు సినిమాకు వెళితే.. కనీసం రూ.3వేల వరకు ఖర్చయ్యేలా. రోజు రోజుకూ ధరల భారం పెరడగం.. కోవిడ్‌-19 పుణ్యమా అంటూ ఓటీటీలకు అలవాటు పడటంతో మల్టిఫ్లెక్స్‌లు, ధియేటర్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement