Friday, April 19, 2024

పత్తి ధరలు పైపైకి.. సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

(ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : జిన్నింగ్‌ మిల్లులలో పత్తి క్వింటాలు వారం క్రితం గరిష్టంగా రూ.7 వేల దాకా ఉండేది. ఈ రెండు రోజుల నుంచి క్వింటా పత్తి ధర పెరిగింది. ప్రస్తుతం క్వింటాలు పత్తి రూ.8,900 దాకా పలుకుతోంది. నాణ్యత లేని పత్తికి కనిష్టంగా క్వింటాలుకు రూ.7,200 చెల్లిస్తున్నారు. వారం రోజుల్లోనే ధరలు పెరగడంతో రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నా అది తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.6,025గా నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో పత్తి ధరలు మద్దతు ధరను మించి ఉండడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడలేదు.

ముందు జాగ్రత్తగా వికారాబాద్​ జిల్లాలోని 9 ప్రాంతాలలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. జిల్లాలో గత రెండు వారాల నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఖరీఫ్‌లో రైతులు దాదాపు 2 లక్షల పైబడి విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేశారు. భారీ వర్షాల కారణంగా సగం విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి పంటపై ప్రతికూల ప్రభావం పడింది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పత్తి పంటకు నష్టం జరిగింది. నల్లరేగడి పొలాల్లో సాగు చేసిన పత్తి మొత్తంగా పాడైంది. ఇసుక నేలల్లో సాగు చేసిన పత్తి కొంత వరకు భారీ వర్షాలను తట్టుకొని నిలబడింది.

జిల్లాలో నెల రోజుల నుంచి పత్తి దిగుబడి వస్తోంది. దసగా పండగకు ముందు నుంచి పత్తి దిగుబడి ప్రారం భమైంది. అయితే జిన్నింగ్‌ మిల్లులలో పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు పండించిన పంటను ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. గత రెండు వారాల నుంచి జిన్నింగ్‌ మిల్లులలో పత్తి కొనుగోలు ప్రారంభమైంది. మొదట్లో పత్తికి తక్కువ ధరలను పెట్టి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ప్రయత్నించారు. రైతులు ఎవరు కూడా పత్తిని విక్రయించేందుకు ముందుకు రాలేదు. తప్పని పరిస్థితులలో జిన్నింగ్‌ మిల్లుల యజమానులు పత్తి ధరలను క్రమం తప్పకుండా పెంచుతున్నారు.

ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంట వాతావరణ పరిస్థితు కారణంగా దెబ్బతినడంతో దిగుబడి భారీగా తగ్గింది. దీంతో పత్తి పంటకు ధరలు ఎక్కువగా ఉంటాయని రైతులు అంచనా వేశారు. మార్కెట్‌ వర్గాలు సైతం ఇదే అంచనాతో ఉన్నాయి. పొరుగున ఉన్న రాష్ట్రాలలో పత్తి క్వింటాలు రూ.10 వేల పైబడి పలుకు తోంది. జిల్లాలో మాత్రం మొదట పత్తి ధరలు రూ.7 వేలు నమోదు అయ్యాయి. తాజాగా ధరలను పెంచి రూ.8,900 చేశారు. అయినా కూడా కొందరు రైతులు పత్తిని విక్రయించకుండా నిల్వ చేసుకుం టున్నారు. రూ.10 వేల వరకు ధరలు లభిస్తేనే విక్రయిస్తామని పత్తి రైతులు పేర్కొంటున్నారు.

యాసంగి పంటలకు పెట్టుబడి అవసరం అయిన రైతులు మాత్రమే పత్తిని జిన్నింగ్‌ మిల్లులలో విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు డజను వరకు జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. పత్తిని కొనుగోలు చేసేందుకు మిల్లుల యజమా నాలు పోటీ పడుతున్నారు. దీంతో పత్తి ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతులు మరో పక్షం రోజులు నిరీక్షిస్తే మొదటి రకం పత్తి ధరలు రూ.10 వేల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement