Saturday, November 30, 2024

YS Vijayamma | సోష‌ల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే ఊరుకోను !

వైఎస్ విజయమ్మ మరో లేఖ విడుదల చేశారు. తన కారు ప్రమాదంపై సోష‌ల్ మీడియాలో దుష్ఫ్రచారం చేస్తున్నారని.. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ ప్రమాదానికి తన కుమారుడు కారణమన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తున్నారని ఫైర్ర అయ్యారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఇక మీదట చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

‘‘గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతోంది. నన్ను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ణ రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉంది.

వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ వివరణ రాస్తున్నాను. రెండు రోజుల కిందట నా కారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని … నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చెయ్యడం అత్యంత జుగుప్సాకరం.

రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి… భయపడి నేను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

- Advertisement -

ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇకముందు ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపితే మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారు. ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తే నేను చూస్తూ ఊరుకోదలచుకోలేదు.” అని వైఎస్ విజయమ్మ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement