Thursday, June 1, 2023

మంత్రి పువ్వాడ అడ్ర‌స్‌తో 600 దొంగ ఓట్లు?

మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఖ‌మ్మంలో దొంగ ఓట్లు న‌మోద‌య్యాయ‌న్న వార్త‌ క‌ల‌క‌లం రేపుతోంది. మంత్రి పువ్వాడ అజ‌య్ కు చెందిన మ‌మతా మెడిక‌ల్ కాలేజ్ కేంద్రంగా ఈ దొంగ ఓట్లు న‌మోద‌య్యాయ‌ని, ఒక్క పువ్వాడ ఇంటి అడ్ర‌స్ తోనే ఏకంగా 600 ఓట్లున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మమతా మెడికల్ క్యాంపస్ ఓటర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే నగరంలో వేలసంఖ్యలో బోగస్ ఓట్లు సృష్టించినట్లు ఆరోపణలు వినిపించాయి.

ఇదే అంశాన్ని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తీన్మార్ మ‌ల్లన్న కూడా ఆరోపించారు. ఓట‌ర్‌కు తెలియ‌కుండానే ద‌ర‌ఖాస్తులు తీసుకున్నార‌ని, బూత్ లెవ‌ల్ అధికారులు స‌హ‌క‌రించ‌టంతో విచార‌ణ జ‌ర‌ప‌కుండానే ఓట‌ర్ల జాబితా త‌యారు చేశార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఓట‌ర్ లిస్టులో పేర్లున్న‌ప్ప‌టికీ ఆ అడ్ర‌స్‌కు వెళ్తే ఓట‌ర్లే లేర‌ని, ఫోన్ ద్వారా సంప్ర‌దిస్తే వారంతా ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్నార‌ని ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు, మెడికల్ కాలేజ్ ఉద్యోగుల అడ్ర‌స్ ప్రూఫ్‌లతో దరఖాస్తు చేశార‌ని, ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement