Wednesday, April 17, 2024

Delhi: పాలనలో వైఫల్యం, అన్నింటా అవినీతి.. దృష్టిమళ్లించడానికే వర్సిటీ పేరు మార్పు: సీఎం రమేశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడానికి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త యూనివర్సిటీ లేదా కొత్తగా నిర్మించిన ఏ సంస్థకైనా వైఎస్సార్ పేరు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని, ఎప్పటి నుంచో ఉన్న యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ప్రపంచంలో ఆంధ్రులకు పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, అలాంటి మహనీయుడి పేరును తొలగించడాన్ని రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకిస్తోందని ఆయనన్నారు. పేరు మార్చడమంటే పిచ్చి చర్య లేదా మదంగా ఆయన సూత్రీకరించారు. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలకో లేదా వేరే సంస్థలతో వైఎస్సార్ పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇలా ఉన్న పేర్లను తొలగిస్తే, జగన్ ప్రభుత్వంలో పెట్టిన పేర్లను భవిష్యత్తులో మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

నిజానికి అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతూ పాలనలో వైఫల్యం చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాటిపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడం కోసమే పేరు మార్పు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని సీఎం రమేశ్ మండిపడ్డారు. వర్గాల మధ్య వైషమ్యాలు తెచ్చేందుకు పేరు మార్చుతూ బిల్లు పెట్టారని ఆరోపించారు. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులను టెండర్లు లేకుండా కట్టబెడుతున్నారని, ఇసుక, లిక్కర్, మైనింగ్ సహా అనేక రంగాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకోబోమని, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement