Saturday, April 20, 2024

సెనెగల్‌లో భారత పెట్టుబడులకు విస్తృత అవకాశాలు. : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సెనెగల్ దేశంలో భారతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతావకాశాలున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పరస్పరం వేగవంతమైన, సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ స్నేహసంబంధాలను కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచాభివృద్ధికి భారతదేశం కీలకంగా మారుతున్ననేపథ్యంలో భారతదేశ విశ్వసనీయమైన భాగస్వాములుగా ఆఫ్రికా దేశాల్లోనూ సమగ్రమైన పురోగతి సాధ్యమవుతుందన్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటైన సెనెగల్ రాజధాని డకార్ లోని యునివర్సిటీ చీక్ అంటా డియోప్ (యూసీఏడీ) ‘తిరంగా అండ్ తెరంగా: భారత్-సెనెగల్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు’ ఇతివృత్తంతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ‘శాంతి, గౌరవం, కొత్త అంశాలను స్వీకరించే సామర్థ్యం, ప్రజాస్వామిక విలువలన్నీ కలబోసిన ‘తెరంగా’ సెనెగల్ మూలవిలువలకు ప్రతిబింబం. అందుకే భారతదేశం, సెనెగల్ మధ్య సత్సంబంధాలు 60 ఏళ్లుగా కొనసాగుతున్నాయి’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఇరుదేశాలు సాంస్కృతిక సహనం, బహుళ సంప్రదాయాలు, ప్రజలమధ్య సత్సంబంధాలను కోరుకుంటాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్, ఆఫ్రికాలోని సుస్థిరమైన ప్రజాస్వామ్యంగా సెనెగల్ దేశాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన అన్నారు. అందుకే ఈ రెండు దేశాలు సహజమైన అభివృద్ధి భాగస్వాములుగా నిలిచిపోయాయన్నారు. ఇరుదేశాల భాషలు, సంస్కృతి, సంప్రదాయాల్లోనూ సారూప్యత ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతీయ సినిమాలు సెనెగల్ లో ఇష్టంగా చూడటం ఇరుదేశాల మధ్య సారూప్యతకు నిదర్శనమన్నారు.

అంతకుముందు రోజు మాన్యుమెంట్ ఆఫ్ ఆఫ్రికన్ రినైజెన్స్ సందర్శనను ప్రస్తావిస్తూ.. సెనెగల్ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఈ మాన్యుమెంట్ ప్రతిబింబించిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి ఇందులో స్థానం కల్పించడం, గాంధేయ వాదానికి సెనెగల్ కల్పిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. భారత నేతృత్వంలోని అంతర్జాతీయ సౌరకూటమిలో సెనెగల్ భాగస్వామి కావడాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయాన్ని పెంపొందించడంతోపాటు, కాలుష్యాన్ని అరికట్టేందుకు వీలుంటుందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని మరింత విస్తృతం చేయడంతోపాటు వివక్షరహిత ప్రపంచ పాలన అందరికీ అందేలా చేయడంలో భారత్, ఆఫ్రికాదేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఇండియా-సెనెగల్ బిజినెస్ ఈవెంట్ లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలోనూ ఇరుదేశాల మధ్య వాణిజ్యం ఆశాజనకంగా సాగిందని, రానున్న రోజుల్లో ఇది మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. దీంతోపాటుగా సెనెగల్ లో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ వ్యాపారవేత్తలకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మరీ ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం సంరక్షణ, ఐసీటీ, మైనింగ్ తదితర రంగాల్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. ఈ సమావేశాల్లో ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఎంపీలు సుశీల్ కుమార్ మోదీ, విజయ్ పాల్ సింగ్ తోమర్, పి.రవీంద్రనాథ్, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement