Thursday, April 25, 2024

మాగుంట రాఘవ రిమాండ్ పొడిగింపు.. ఈడీ విచారణకు శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ కోర్టు మరో 10 రోజులు పొడిగించింది. శనివారం నాటికి జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో సీబీఐ అధికారులు రాఘవను మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఈ మేరకు మార్చి 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ ఉత్తర్వులిచ్చారు.

మరోవైపు మద్యం పాలసీ కేసులో చోటుచేసుకున్న మనీలాండింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సమన్లు జారీ చేసి శనివారం హాజరుకావాల్సిందిగా ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆయన హుటాహుటిన శుక్రవారం రాత్రి చెన్నై బయల్దేరి వెళ్లినట్టు తెలిసింది. ఈ కారణంతోనే ఆయన విచారణకు హాజరుకాలేదని తెలిసింది. అయితే అధికారికంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ విధానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావించారు.

- Advertisement -

ఇదే విషయాన్ని స్పెషల్ కోర్టుకు చెప్పి పిళ్ళై కస్టడీ పొడిగించాలని కోరారు. ఆ మేరకు శుక్రవారం బుచ్చిబాబు, శనివారం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సోమవారం కల్వకుంట్ల కవితతో కన్‌ఫ్రంటేషన్ విధానంలో పిళ్ళైని ప్రశ్నించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం అనుకున్నట్టుగానే కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతో పిళ్ళైకి కన్‌ఫ్రంటేషన్ జరిగింది. కానీ శనివారం మాగుంట హాజరుకాకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తాము ముందుగానే సేకరించిన సాంకేతిక సాక్ష్యాధారాలను ఎదురుగా పెట్టుకుని అనుమానితులు, నిందితులను ప్రశ్నిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో కేసుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు తప్పును మరొకరిపై నెట్టేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు డిజిటల్ సాక్ష్యాధారాలతో పాటు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తూ జరిగిన నేరాన్ని బయటపెట్టే ప్రయత్నం దర్యాప్తు అధికారులు చేస్తుంటారు. ఎంతో ప్రభావవంతమైన విధానంగా పేరున్న కన్‌ఫ్రంటేషన్ ద్వారా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అటు సీబీఐ, ఇటు ఈడీ ఎంతో కీలక సమాచారాన్ని రాబట్టగల్గింది. అయితే తాజాగా మాగుంట హాజరుకాకపోవడంతో విచారణకు కొంత బ్రేక్ పడ్డట్టయింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement