Saturday, April 20, 2024

ధర కోసం పత్తి రైతుల ఎదురుచూపులు.. రెండు నెలలుగా పతనమైన పత్తి ధరలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గిట్టుబాటు ధరలు రాకపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా రాష్ట్రంలో పత్తి ధరలు భారీగా పతనమయ్యాయి. గతేడాది ఇదే సమయానికి రికార్డు స్థాయిలో క్వింటా పత్తికి రూ.12వేలు ధర పలకగా ఈ సారి రూ.8వేల లోపు మాత్రమే ఉంటోంది. దీంతో తెల్లబంగారంగా పిలుచుకునే పత్తిని సాగు చేసిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ సీజన్‌ ఆరంభంలో పత్తికి దాదాపు క్వింటా పత్తికి రూ.9వేలకు పైచిలుకు ధర పలికింది. దీంతో ధర మరింత పెరుగుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. గత సంవత్సరం క్వింటాలుకు రూ.12వేలకు పైగా ధర పలికిన పత్తికి ఈ సారి ధర రూ.15వేలు దాటుతుందని ఆశించిన పత్తి రైతులకు నిరాశే మిగిలింది. ఈ సారి పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,300 పలికింది. బహిరంగ మార్కెట్‌లో రూ.8వేలకు మించి పలకడం లేదు. ఈ ఏడాది అధిక వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.

ఎంత లేదన్నా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి భారీ వర్షాలకు ఎకరాకు సగటున 4 నుంచి 5 క్వింటాళ్లు మించలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యయప్రయాసాలకోర్చి పంట వచ్చిన అరకొర దిగుబడికి కూడా ఆశించిన ధర రాకపోవడంతో రైతులు పత్తి పంటను తమ ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ధర వచ్చినపుడే పత్తి అమ్ముతామని స్పష్టం చేస్తున్నారు. అయితే నవంబరు మూడో వారంలో పడిపోయిన పత్తి ధరలు రెండు నెలలు గడుస్తున్నా పెరిగిన దాఖలాలు లేవు. మరో నెల రోజులదాకా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో పత్తి నిల్వ ఉంచుకోలేక రైతులు, పత్తి ప్రాసెసింగ్‌ పనులతో కళకళలాడాల్సిన జిన్నింగ్‌ మిల్లులు వెలవెలబోతున్నాయి.


ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించినంత దిగుబడి రాలేదని, ఎకరా సాగుకు రూ.20వేల దాకా పెట్టుబడి అయిందని రైతులు వాపోతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో రెండు నెలలుగా ఇంట్లోనే పత్తిని నిల్వ చేసినా సానుకూల పరిస్థితులు ఏర్పడి ధర పెరగడంలేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న రేటుకు అమ్ముకుంటే ఏ మాత్రం గిట్టుబాటు కాదని, ఆరు నెలలు కష్టపడి సాగు చేసిన కష్టం బూడిదలో పోసినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.10వేలకు మించి ధర పలికితేనే పెట్టిన పెట్టుబడులు అయినా వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement