Wednesday, March 27, 2024

పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు.. ఈ ఏడాదే నోటిఫికేషన్‌ జారీకి అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ : పోలీసుశాఖలో పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. సీఎం సూత్ర ప్రాయ అంగీకారంతో ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఇదే విషయంపై పోలీసు వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఉన్నతాధికారులు ఇందుకోసం పూర్తి స్ధాయిలో దృష్టి సారించినట్లు వినికిడి. పోలీసుశాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి గత రెండేళ్ళుగా ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నిరీక్షిస్తోంది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎంతోమంది అభ్యర్ధులు ఎదురుచూశారు. మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణాలో భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదే మాటతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో పోలీసు ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణాలో దాదాపు నియామక ప్ర క్రియ చివరి దశకు చేరుకున్నట్లుంది. కాగా తెలంగాణాలో కేసిఆర్‌ ప్రభుత్వం పోలీసు శాఖలో నియామకాల ప్రకటన చేయగానే ఏపీలో కూడా ఇక్కడి నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు చెబుతుందనే ఆశతో గత కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా 26వేల పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ వెలువడిందనే సమాచారంతో నిరుద్యోగుల ఆశలు చిగురించినట్లైంది. పైగా ఈ ఏడాదే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈమేరకు హోంమంత్రి తానేటి వనిత తాజా ప్రకటన మరింత ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఇందుకోసం ఏపి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

త్వరలో నోటిఫికేషన్‌..
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్‌ శాఖలో భారీగా ఉద్యోగాలకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పోలీస్‌ శాఖపై ముఖ్యమం త్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన గత సమీక్ష సమావేశంలో పోలీస్‌ శాఖలో ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు. ఈ మేరకు పూర్తి నివేదిక ఇవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్‌ శాఖ ఖాళీలకు సంబంధించి ఇప్పటికే భర్తీ చేయాల్సిన పోస్టులు, రాష్ట్ర అసరాల దృష్ట్యా అదనపు పోస్టులు మొత్తం కలిపి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్న దానిపై సమాచారం సేకరించారు. రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు.ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్‌ సూత్రప్రాయంగా అంగీకరించడంతో త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది. పైగా సత్యసాయి జిల్లాలో పర్యటనలో ఉన్న హోం మంత్రి పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీ విషయమై మీడియా వద్ద ప్రస్తావనకు రాగా త్వరలోనే ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్‌ రానున్నట్లు ప్రకటించారు. దీంతో నిరుద్యోగులకు మరింత తీపి కబురు అందించినట్లైంది. అయితే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది వెల్లడి కాలేదు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో నూతనంగా ప్రారంభించిన ఫోరెన్సిక్‌ సెంటర్‌తోపాటు, అమరావతిలోని మంగళగిరి డీజీపీ కార్యాలయం సమీపంలో ఉన్న టెక్‌టవర్‌లోని ఏపీ ఫోరెన్సిక్‌ విభాగంలో కూడా ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఇందులో పరిమిత సంఖ్యలో పోస్టులు ఉన్నందున అవుట్‌ సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే ఆలోచనలో పోలీసుశాఖ ఉన్నట్లు సమాచారం.

పెరిగిన ఉద్యోగాల సంఖ్య..
గతేడాది జూన్‌లో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి పదివేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 6,500 చొప్పున నాలుగేళ్ళ పాటు పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీకి సీఎం గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసుశాఖలోని వీక్లీ ఆఫ్‌ సమస్యతో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య పెరిగింది. జగన్‌ స ర్కార్‌ వచ్చాక పోలీసులకు వారాంతపు శెలవు విధానం తీసుకువచ్చారు. అయితే 2019 జూన్‌ నుంచి మూడు నాలుగు నెలలు మాత్రమే కొంతవరకు అమలు చేయగలిగారు. అప్పటికే సిబ్బంది కొరత వివిధ కారణాలతో వీక్లీ ఆఫ్‌ వెనక్కు వెళి ్ళంది. వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలన్నా.. సిబ్బంది కొరతను అధిగమించాలన్నా.. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల్లో సిబ్బంది నియామకం జరగాలన్నా.. అదనంగా మరో పదివేలకు పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపధ్యంలో నోటిఫికేషన్‌ వెలువడితే కానిస్టేబుల్‌ పోస్టులే దాదాపు 15వేల వరకు ఉండవచ్చని, ఎస్‌ఐ తదితర పోసులు మిగితా ఉండవచ్చని అభ్యర్ధులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఏడాది చివరిలోగా నోటిఫికేషన్‌ వెలువడుతుందనే ఆశాభావం వారిలో నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement