Monday, March 25, 2024

కాంగ్రెస్ ‘రైతు రచ్చ బండ’కు అంతా రెడీ.. వరంగల్‌ డిక్లరేషన్‌తో జనాల్లోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రైతు రచ్చబండ ‘ కార్యక్రమంతో శనివారం నుంచి వచ్చే నెల జూన్‌ 21 వరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. వరంగల్‌ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను విస్తృతంగా జనంలోకి తీసుకుపోనున్నారు. ప్రతి గ్రామంలో రచ్చబండ ను నిర్వహించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చేయనున్న పనులను కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతులకు వివరించనున్నారు. ఈ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్‌ జయంశకర్‌ సొంత గ్రామం హన్మకొండ జిల్లా, పరకాల నియోజక వర్గంలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించానున్నారు. మిగతా నాయకులు కూడా వారి సొంత నియోజక వర్గాల్లోని వివిధ గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు క్రియాశీలకంగా వ్యవహారించనున్నారు. టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పార్లమెంట్‌ పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కూడా నెల రోజులకు సంబంధించి కార్యక్రమ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రోజుకు రెండు, మూడు గ్రామాల చొప్పున పర్యటించే విధంగా కార్యక్రమం సిద్ధం చేశారు. భువగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏ గ్రామానికి సమయమిస్తారో అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ బీర్ల అయిలయ్య ఇప్పటికే రైతు రచ్చబండతో పాటు ఇతర సామాజిక అంశాలపై నిత్యం ప్రజల్లోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో రచ్చబండను ప్రారంభించనున్నారు. మిగతా నియోజక వర్గాల్లోనూ ప్రతి నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పార్టీకి మరింత లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గత కొన్ని నెలలుగా ఆందోల్‌ నియోజక వర్గంలోనే తిష్ట వేసి పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌లో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, షబ్బీర్‌అలీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్లారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ రైతు రచ్చబండ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరించడమే కాకుండా.. రైతు సెంటిమెంట్‌తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్‌ నేతలున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement