Thursday, February 2, 2023

రాయితీలు కోరుతున్న ఈవీ ఇండస్ట్రీ.. బడ్జెట్‌లో ప్రతిపాదనలకు అభ్యర్ధన

దేశంలో క్రమంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా ఈ రంగానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను కొనసాగించడంతో పాటు, కొన్నింటిపై జీఎస్టీని తగ్గించాలని ఈవీ ఇండస్ట్రీ కోరుతోంది. కొత్త బడ్జెట్‌లో ఈవీ రంగానికి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నదానిపై ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పెరుగుతున్న పర్యావరణ సమస్యలకు ఒక పరిష్కారంగా ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దీనితో పాటు ఇంధన దిగుమతుల బిల్లు తగ్గించుకోవడం కూడా మరో ముఖ్యమైన ఉద్దేశ్యం. మన దేశంలో క్రమంగా ఈవీ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో వినియోగదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. 2022లో మన దేశంలో ఈవీల అమ్మకాల్లో 210 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం దేశంలో 14 లక్షలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు తిరుగుతున్నాయి.

ఈవీలకు ప్రభుత్వ పరంగా రాయితీలు ఇస్తున్నప్పటికీ, ఇంకా సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాల అమ్మకాలే అధికంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగం మరింతగా వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వనుందన్న దానిపై ఇండస్ట్రీ ఆశాభావంగా ఉంది. ఇప్పటికే ఉన్న వాటిలో కొన్నింటికి కొనసాగించాలని, మరికొన్నింటిపై జీఎస్టీని తగ్గించాల్సి ఉందని ఈవీ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023లో ఈ రంగంలోకి అన్ని ప్రముఖ కంపెనీలు భారీ ఎత్తున వాహనాలను విడుదల చేయనున్నాయి. ప్రస్తుతం దేశంలో విద్యుత్‌ కార్లు, టూ వీలర్స్‌నే ఎక్కువ రోడ్లపైకి వస్తున్నాయి. వీటితో పాటు కమర్షియల్‌ వాహనాలు, త్రీ వీలర్స్‌, ట్రాన్స్‌పోర్టు వాహనాలు, ప్రజా రవాణాకు సంబంధించిన బస్సులు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. రానున్న కాలంలో కంపెనీలు ఈ దిశగా వాహనాలను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -
   

జీఎస్టీ తగ్గించాలి..

ఈ సారి బడ్జెట్‌లో విద్యుత్‌ వాహనాలపై, విడిభాగాలపై ఉన్న జీఎస్టీని తగ్గించాలని పరిశ్రమ ప్రధానంగా కోరుతున్నది. ఫుడ్‌ డెలివరీ వాహనాలపై జీఎస్‌టీని తగ్గించాలని పరిశ్రమ గట్టిగానే డిమాండ్‌ చేస్తోంది. దేశంలో జొమాటో, బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌,ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ వంటి అనేక సంస్థలు టూ, త్రీ వీలర్స్‌ను వినియోగిస్తున్నాయి. జీఎస్టీ తగ్గిస్తే ఈ సంస్థలు వినియోగిస్తున్న వాహనాలన్నీ ఈవీలుగా మారే అవకాశం ఉంది. జీఎస్టీ తగ్గిస్తే వచ్చే రెండు సంవత్సరాల్లో డెలివరీ వాహనాలన్నీ ఈవీలుగా మారుతాయని జిప్‌ ఎలక్ట్రిక్‌ సహ వ్యవస్థాపకుడు సీఈఓ ఆకాశ్‌ గుప్తా అభిప్రాపయడ్డారు. విద్యుత్‌ వాహనాల తయారీలో కీలకంగా ఉన్న బ్యాటరీలపై పన్ను తగ్గించాలని ప్రరిశ్రమ కోరుతున్నది. దీనిపై పన్నులు తగ్గితే వాహనాల ధరలు తగ్గుతాయని, దీని వల్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మన దేశంలో బ్యాటరీ సెల్స్‌ తయారీ పెరిగే వరకు దిగుమతి సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతున్నది. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. విడి భాగాలపై కూడా జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతున్నది. 2022-23 బడ్జెట్‌లో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. ఫేమ్‌-2 స్కీమ్‌ కింద 10 వేల కోట్ల ఆర్ధిక ప్రోత్సహకాలను ప్రకటించింది. మరోవైపు తయారీని పెంచడం కోసం కంపెనీలకు 44,038 కోట్ల విలువైన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సహకాలు(పీఎల్‌ఐ)ని ప్రకటించింది.

వాణిజ్యవాహనాలు పెరగాల్సి ఉంది

పరిశ్రమ, ప్రభుత్వం కూడా ప్రయాణీకుల వాహనాలు, టూ వీలర్స్‌పైనే కేంద్రీకరించాయి. ఇక నుంచి వీటితో పాటు వాణిజ్య వాహనాల విభాగంలోనూ విద్యుత్‌వి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై పరిశ్రమతో పాటు, ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈవీ వాణిజ్య వాహనాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలపై వడ్డీలను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇక నుంచి ప్రభుత్వం పెద్ద ఈవీ వాహనాలు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయలపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. వీటికి కూడా ప్రోత్సహక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు కోరుతున్నారు.

ఫేమ్‌-2 స్కీమ్‌ను పొడిగించాలి

ఫాస్టర్‌ అడాప ్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(ఫేమ్‌-2) రెండో దశ ప్రోత్సాహకాలను మరికొంత కాలం పొడిగించాలని ఈవీ తయారీ కంపెనీలు కోరుతున్నాయి. ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్స్‌ సహా అన్ని విద్యుత్‌ వాహనాలకు కిలోవాట్‌కు 15 వేల చొప్పున డిమాండ్‌ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈవీ టూ వీలర్స్‌ మొత్తం ధరలో రాయితీ పరిమితి 40 శాతం వరకు ఉంది. దీన్ని 2024 మార్చి 31 వరకు కొనసాగించాలని పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. ఫేమ్‌-2ను దశలవారీగా లైట్‌ మోటార్‌, మీడియం, హెవీ వాహనాలు, ట్రాక్టర్లుకు కూడా విస్తరించాలని కోరుతున్నారు.

ఛార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటుకు

తగినన్ని ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో ఈవీ వాహనాల అమ్మకాలు ఆశించనంత వేగంగా పెరగడంలేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దిశగా ఇక నుంచి మరింత వేగంగా ఛార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అన్ని పెట్రోల్‌ బంక్‌ల్లో ప్రధానంగా జాతీయ రహదారి వెంట ఉన్న వాటిలోనైనా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కనీసం 50 శాతం రాయితీ ఇస్తే, ఇవి వేగంగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పన్ను రాయితీలు కొనసాగాలి…

ప్రస్తుతం విద్యుత్‌ వాహనాల కొనుగోలు కోసం తీసుకుంటున్న రుణాలపై చెల్లించే వడ్డీపై గరిష్టంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. 2023, మార్చి 31 వరకు తీసుకునే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని పరిశ్రమ కోరుతున్నది. విద్యుత్‌ కార్లు కొనుగోలు చేసే వారికి కొనుగోలు చేసిన సంవత్సరంలోనే ఒకేసారి పన్ను మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కూడా కోరుతున్నది. ఈవీ కొనుగోలుపై ఇస్తున్న ఫేమ్‌-2 ప్రోత్సహకాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాయితీని కస్టమర్లకు ఇవ్వకుండా, చాలా కంపెనీలు ఆ మేర రేటు పెంచి విక్రయిస్తున్నట్లు కూడా ఆరోపణులు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కస్టమర్లు కోరుతున్నారు. ఫేమ్‌-2 సబ్సిడీని ఎగవేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ధరలు ఎక్కువ…

ఈవీ కార్లు, టూ వీలర్లు, త్రీ వీలర్ల ధరలు సంప్రదాయ వాహనాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఈవీ అమ్మకాలు పెద్దగా పెరగకపోవడానికి అవరోధంగా ఉంది. ప్రధాన కంపెనీలు కూడా ఈవీ టూవీలర్స్‌, కార్ల ధరలకు చాలా ఎక్కువగా నిర్ణయించాయి. వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు, రేంజ్‌ కూడా తక్కువగా ఉండటం ప్రధాన అవరోధంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement