Saturday, June 3, 2023

కేంద్రీయ విద్యాలయాల‌ ఏర్పాటు నిరంతర ప్రక్రియ.. ఉన్నత విద్యకు రూ. 9081.10 కోట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల‌ ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల‌ ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లేంటని టీఆర్ఎస్ లోక్‌స‌భా ప‌క్ష నేత‌, ఖ‌మ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వ‌రరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వోద్యోగులు, దాని అనుబంధ‌ రంగ సంస్థ‌లకు చెందిన ఉద్యోగుల పిల్ల‌ల విద్యా అవ‌స‌రాలు తీర్చేందుకు ప్రాథమికంగా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తారని వివరించారు. మనదేశంలో 261 జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ కేవీలు ఉన్నాయని కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు.

ఉన్నత విద్యకు నిధులు

- Advertisement -
   

అలాగే గడిచిన రెండేళ్లలో కోవిడ్ కారణంగా ఉన్నత‌ విద్యకు పూర్తి స్థాయిలో ఖ‌ర్చు చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. 2019-20 ఆర్థిక సంవ‌త్సరంలో కేంద్ర విద్యా శాఖ‌లోని వివిధ ప‌థ‌కాల‌కు రూ. 11,364.37 కోట్లు కేటాయిస్తే రూ. 10,277.91 కోట్లు ప్రభుత్వం విడుద‌ల చేసిందని సుభాష్ సర్కార్ సమాధానమిచ్చారు. అందులో కేవ‌లం రూ. 9,580.62 కోట్లు మాత్రమే ఖ‌ర్చు అయిన‌ట్టు స్పష్టం చేశారు. మిగ‌తా రూ.1,783.95 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉందన్నారు. 2020-21 ఆర్థిక సంవ‌త్సరంలో ఉన్నత విద్యకు రూ. 9081.10 కోట్లు కేటాయించగా, అందులో రూ. 5236.45 కోట్లు మాత్రమే ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement