Saturday, March 23, 2024

పెరగనున్న ఇంజనీరింగ్‌ ఫీజులు.. 50 శాతం పెంచాలని కార్పొరేట్‌ కాలేజీల ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీటెక్‌ ఫీజులు వచ్చే మూడు 2022-25 విద్యా సంవత్సరాలకు పెరగనున్నాయి. ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల ఖరారుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈ రోజు(గురువారం) నుంచి ఈనెల 20వ తేదీ వరకు ఆయా కాలేజీలతో సంప్రదింపులు జరపనుంది. రోజుకు కొన్ని కాలేజీల చొప్పున మొత్తం 145 కాలేజీలతో ఫీజుల అంశంపై సమావేశం కానున్నారు. అయితే ఫీజుల ఖరారుకు సంబంధించి ప్రక్రియను గత మే 16వ తేదీ నుంచి ప్రారంభించినప్పటికీ ఫీజుల నిర్ధారణపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త మార్గదర్శకాలు రావడంతో ఫీజుల ప్రక్రియను అప్పట్లో నిలిపివేశారు. జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రాలకు ఏఐసీటీఈ లేఖ రాసింది. కమిటీ సిఫారసు చేసిన బీటెక్‌కు కనీస ఫీజు రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,800 ఉండాలని ఆ లేఖలో సిఫారసు చేసింది. దీన్ని కేంద్ర విద్యాశాఖ కూడా ఆమోదించింది. ఈ ఫీజులను అమలు చేయాలని ఏఐసీటీఈ లేఖ రాసిన నేపథ్యంలో వీటిపై చర్చించిన టీఏఎఫ్‌ఆర్‌సీ తుది నిర్ణయం తమదేనని గతంలోనే సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ఇచ్చిందని అధికారులు చెప్తున్నారు. కమిటీ సిఫారసు చేసిన కనీస ఫీజును రూ.79,600 అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఫీజుల భారం పడనుంది. ఈ క్రమంలోనే శ్రీకృష్ణ కమటీ సిఫారసులను పక్కనబెట్టి ఫీజులపై తుది నిర్ణయాన్ని టీఏఎఫ్‌ఆర్‌సీ తీసుకోనుంది. ఇందులో భాగంగానే ఫీజుల ఖరారు ప్రక్రియను నేటి నుంచి చేపడుతోంది.

50 శాతం వరకు పెంచాలంటున్న కాలేజీలు…

ప్రతి మూడేళ్ల కాలానికి ఫీజులను టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేయనుంది. 2019-22 మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఖరారు చేసిన ఫీజుల గడువు ముగియడంతో 2022-25 కాలానికి ప్రస్తుతం ఫీజులను ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఈనెల 20 వరకు, రోజుకు కనీసం 5 నుంచి 10 కాలేజీలతో ఏఎఫ్‌ఆర్‌సీ సంప్రదింపులు జరపనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా, గరిష్ఠ ఫీజు రూ.1.34 లక్షలు ఉంది. అయితే కొన్ని కాలేజీలు ఫీజును 50 శాతం వరకు పెంచాలని కోరుతుంటే, మరికొన్ని కాలేజీలేమో తగ్గించుకుంటామని ప్రతిపాదించాయి. టీఏఎఫ్‌ఆర్‌సీ మాత్రం కళాశాలల ఆదాయ, వ్యయాలు, వసతులు, ప్రమాణాలను లెక్కలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేస్తామంటుంది. ఆదాయ, వ్యయాలు, ప్రమాణాలను బట్టే పెంచడం ఉంటుందని, ఆయా కాలేజీలు ఎంత అడిగితే అంత పెంచడం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. అయితే వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు మిగులుతుండటంతో కొన్ని కాలేజీలు స్వతంత్రంగానే ముందుకొచ్చి తాము ఫీజులను తగ్గించుకుంటామంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని బీఈడీ కాలేజీలు ఫీజును తగ్గించుకునేందుకు ముందుకు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే బీఈడీ, బీపీఈడీ, లా కోర్సుల ఫీజులు ఖరారు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎంబీఏ, ఎంఈసీఏతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేయనుంది. ఖరారు చేసిన ఫీజులను ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. ఆమోదం లభించిన తర్వాత 2022-25 మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులు ఖరారు కానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement