Thursday, March 28, 2024

అప్పుల బాధతో సర్పంచ్ ఆత్మహత్య!

ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాక పోవడంతో మనస్తాపం చెందిన ఓ సర్పంచ్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే ఆనందరెడ్డి 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.18 లక్షల వరకు వెచ్చించి సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు నిర్మించారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి దాదాపు రూ.38 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆనందరెడ్డి కిడ్నీలు దెబ్బతినడంతో అనారోగ్యం పాలయ్యారు. ఆస్పత్రుల్లో వైద్యం కోసం రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. దీంతో అప్పులు చెల్లించే మార్గం కనిపించకపోవడం, ప్రభుత్వ నుంచి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియక మనస్తాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పద్మ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement