Saturday, October 12, 2024

ఈసారి బంపర్‌ సేల్స్‌.. పండుగ సీజన్‌పై ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి కంపెనీల నజర్‌

ఈ పండగ సీజన్‌లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విక్రయాల్లో గణనీయ వృద్ధి నమోదవుతుందని పరిశ్రమవర్గాలు భారీ అంచనాలతో ఉన్నాయి. కొనుగోళ్లలో విలువపరంగా 18-20 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఓనంతోనే దక్షిణాది మార్కెట్లలో కొనుగోళ్ల జోరు ప్రారంభమైందని, ఈసారి పండగ సీజన్‌లోనే క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఉండటం కలిసొచ్చే అంశమని తెలిపాయి.

దీనివల్ల కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నాయి. వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌ నేపథ్యంలో టీవీలకు భారీ గిరాకీ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పెద్ద తెరలు ఉండే టీవీల కొనుగోళ్లు భారీగా జరగొచ్చని తెలిపాయి. బ్యాటరీ ఆధారిత స్పీకర్లు, సౌండ్‌బార్లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు, ఇయర్‌ బడ్స్‌కు కూడా మంచి గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నాయి.

- Advertisement -

పాత టీవీలు, చిన్న తెరలు ఉన్న టీవీల స్థానంలో వినియోగదారులు పెద్ద తెరల టీవీలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, పానాసోనిక్‌, థామ్సన్‌ వంటి కంపెనీలు తెలిపాయి. క్యూలెడ్‌, ఓలెడ్‌ టీవీ వేరియంట్లలో ప్రీమియం, అల్ట్రా ప్రీమియం టీవీలకు మంచి గిరాకీ ఉంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు కొనసాగనున్న విషయం తెలిసిందే.

గత కొన్నేళ్ల తరహాలోనే ఈసారి కూడా కంపెనీలు ఆఫర్లు, వడ్డీ రహిత రుణ పథకాలు, కొత్త ఉత్పత్తుల విడుదల సహా పలు ప్రోత్సాహకాలతో సిద్ధమయ్యాయి. ప్రీమియం సెగ్మెంట్‌లో కొనుగోళ్లకు ఢోకా ఉండకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ, ద్రవ్యోల్బణం, తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ‘మాస్‌ సెగ్మెంట్‌’లో కొనుగోళ్ల వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చునని పలు కంపెనీలు అభిప్రాయపడ్డాయి.

27 నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌..

ఫెస్టివ్‌ సీజన్‌కి ముందే ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ప్లిప్‌కార్ట్‌’ ఆఫర్ల బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ వచ్చేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంకులతో ప్లిప్‌కార్ట్‌ జత కట్టింది.

ఈ మూడు బ్యాంకుల కార్డులతో, ఈఎంఐ ఆప్షన్లతో జరిగే కొనుగోళ్లపై పదిశాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్లు ఆఫర్‌ చేసింది. పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్లతో జరిపే కొనుగోళ్లపైనా ఈ ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్లు లభిస్తాయి. నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తోంది ప్లిప్‌కార్ట్‌.

ఆపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌, రియల్‌మీ, ఒప్పో, షియోమీ, నథింగ్‌, వివో బ్రాండ్లపై అందుబాటులో ఉన్న పలు స్మార్ట్‌ ఫోన్లపై 80 శాతం వరకూ డిస్కౌంట్‌ పొందొచ్చు. మోటో జీ54 5జీ, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌34 5జీ, రియల్‌మీ సీ 51, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11ఎక్స్‌ 5జీ, ఇన్‌ ఫినిక్స్‌ జీరో 30 5జీ, మోటో జీ84 5జీ , వివో వీ 29ఈ, పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్లపై ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement