Friday, September 22, 2023

Editorial – ప‌త‌కాల ప్ర‌తిష్ట నిలిచేదెలా…

ధర్నాలు, నిరసనలు, సమ్మెలు.. అతి శక్తిమంతమైన అస్త్రాలు. ఇది ఒకప్పటి మాట. సమ్మెలంటే ప్రభుత్వాలు గడగడలాడే రోజులు చూశాం. అదొక విస్తృత పరిధి ఉండే నిరసనాస్త్రం. కార్మిక సంఘాలు ప్రభావవంతంగాను, బలంగాను ఉన్న రోజుల్లో సమ్మెలతో కార్మికులు, ఉద్యోగులు, ఇంకా వివిధ వర్గాల శ్రమజీవులు తమ డిమాడ్లను సాధించుకున్న సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. కాలక్రమంలో సమ్మెలు దాదాపు అవసానదశకు చేరాయి. వాటి పదును తగ్గింది. పాలకులే తగ్గించేశారు. ఇక ధర్నాలు, నిరసనలు అంటే చెప్పేదేముంది! వాటికీ కాలం చెల్లుతున్నదని కళ్లముందు కనిపిస్తున్నది. సమస్యలతో నిరసనలకు దిగితే పట్టించుకుని సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వాలే మొండివైఖరిని ఎంచుకుంటే ఏమనాలి? ప్రస్తుతం ఢిల్లి రాజధానిలో అయిదు నెలలుగా జరుగుతున్న రెజ్లర్ల ధర్నా కార్యక్రమం భావి పరిణామ క్రమాన్ని చెప్పకనే చెబుతున్నది. హస్తిన నుంచి హరిద్వార్‌కి చేరిన ఆ దృశ్యం ఒక విషాదమే. జాతి గర్వించదగ్గ రీతిలో విజయపతాక ఎగరేసి సాధించిన పతకాలను గంగపాలు చేసేందుకు రెజ్లర్లు సిద్ధమ య్యారంటే అంతకు మించిన దారుణం ఇంకేముంటుంది! యావజ్జాతి కకావికలమైంది. ఒళ్లు జలదరించింది. కాని ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తింది.

- Advertisement -
   

నిజానికి ఈ అంశం ఒకవిధంగా చిన్నది. సమస్య పెద్దదే గాని పరిష్కారం చిన్నది. కాలితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేవడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాకతాళీయంగా భాగస్వామ్యమ వుతున్నదా లేక ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉన్నదా? భారత రెజ్లర్ల ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ చుట్టూ ఈ వివాదం నడుస్తున్నది. ఎవరైతే భారతదేశం తరపున అంతర్జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొని, పతకాలు తెచ్చారో వారే బ్రిజ్‌ భూషణ్‌ మీద ఆరోపణలు చేసి ధర్నాలకు ఉపక్రమిం చడాన్ని తేలిగ్గా తీసుకోవడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకంగానే మిగులు తున్నది. ఇది భారతదేశ పరువు ప్రతిష్టలకు సంబంధించినది. జాతీయభావం గురించి పదేపదే వల్లె వేసే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసర అంశంగా పరిగణించి అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమ నంగానైనా మధ్యేమార్గమైన పరిష్కారాన్ని కనుగొని ఉండాల్సింది. కాని అలా జరగలేదు. ప్రభుత్వ మౌనం ఆందోళనకారుల్లో మరింత పట్టుదల పెంచింది. అక్కడే రాత్రిం బవళ్లు మకాం.. నిరాహారదీక్షలు.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ.. ఒకప్పటి రైతుల దీక్ష గుర్తొచ్చింది. పోలీసులు అడుగ డుగునా కట్టడి చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. కారణం తెల్సిం దే.

బ్రిజ్‌భూషణ్‌ పాలకపక్షమైన బీజేపీ లోక్‌సభ సభ్యుడు. పార్టీ లో 1988 నుంచి కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి బలమైన నాయకుడిగా చెలామణి అవుతున్నారు. 1991, 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో మూడుసార్లు బీజేపీ టిక్కెట్‌పై గెలిచి ఎంపీగా ఉన్నారు. 2008లో బీజేపీకి రాజీనామా చేసి, సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. 2009లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌ మీద కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి మళ్లి బీజేపీలో చేరారు. 2019లో 17వ లోక్‌సభకు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఎస్పీ – బీజేపీ సమీకరణల్లో రెండు పార్టీలు ఇతనికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ పరిణామాలు తెలియజేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదర్శవంతమైన చర్యలు తీసుకుంటుందని భ్రమిస్తే అది పొరపాటే అవుతుంది. పోనీ బ్రిజ్‌ సచ్చీలుడా అంటే అదేమీ కాదు. అతని మీద అనేక కేసులు పెండింగ్‌లో ఉండగా, కొన్నింటిలో ఆయన ముద్దాయిగా తేలారు. ఐపిసి సెక్షన్లు 181, 171హెచ్‌, 149, 338, 147, 148, 341, 188 అతణ్ని దోషిగా నిరూపిం చాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆధారపడదగ్గ అతి కొందరు నేతల్లో బ్రిజ్‌ ఒకరు. అందుకే అతని మీద ప్రభుత్వం వైపు నుంచి ఈగ కూడా వాలడం లేదన్న ప్రతిపక్షాల వాదనను కొట్టిపా రేయలేము.

రెజ్లర్లకు నానాటికీ సంఘీభావం పెరుగు తున్నా.. సానుభూతి వెల్లువ అవుతున్నా కదలాల్సిన వ్యవస్థðలు కదలనిదే వారికి న్యాయం జరగడం కల్ల. తనమీద చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమేనని బ్రిజ్‌ తాజాగా మరోసారి ప్రకటించారు. మొదటినుంచీ అతను అదే మాట చెబుతున్నారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఏడుగురు సభ్యులతో వేసిన విచారణకు కమిటీ భవితవ్యమేమిటో చూడాలి. మేరీ కోమ్‌తో సహా ఇందులో అందరూ అథ్లెట్లే ఉన్నారు. బ్రిజ్‌ గత ఫిబ్రవరి చివర్లో ఆ కమిటీ ముందు హాజరయ్యారు. మిగతా కథ సస్పెన్స్‌. మరోవంక ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. బ్రిజ్‌ మీద చర్య తీసుకునేందుకు ఎలాంటి ఆధారాలు దొరకడం లేదని పోలీసులు తాజాగా చేతులెతె ్తశారు. మొన్నటికి మొన్న కొత్త పార్లమెంటు భవన ప్రారంభొ త్సవ వేళ రెజ్లర్లు ధర్నా చేయబోతే పోలీసులు అడ్డుకున్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భం గానైనా ఈ సమస్యకు ఒక దారి చూపి ఉంటే ఆ వేడుకకు సార్థకత లభించి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది కూడా. పతకాలు తెచ్చినప్పుడు ఘనంగా కీర్తించి శాలువలు కప్పి సత్కరించే ప్రభుత్వమే వారికి ఎదురైన సమస్యను పరిష్కరించడానికి వెనకాడటం దురదృష్టకరం. ఆఖరి నిమిషంలో వారు వెనుకంజ వేసి ప్రభుత్వానికి అయిదు రోజుల గడువు విధించారు. ఒకవేళ వారిని ఎవ్వరూ వారించక, పతకాలను గంగానదిలో విసిరి పారేసి ఉంటే ఇదే ప్రభుత్వం వారిమీద కేసు నమోదు చేసి ఉండేది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని, బ్రిజ్‌ భూషణ్‌ని ఫెడరేషన్‌ పదవి నుంచి తప్పించి విచారణ నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని పౌర సమాజం అభిలషిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement