Wednesday, April 24, 2024

ఎడిటోరియ‌ల్ – గోవాలో బిలాల్ కు గ‌ట్టి జ‌వాబు..

భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉన్న దాయాది వైరం నేపథ్యంలో పాకిస్తాన్‌ విదేశాంగమంత్రి బిలావల్‌ భుట్టో రాకతో సభ్యదేశాలు సైతం అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్‌ ఐరాస వేదికల మీద ప్రస్తావించే అంశాలు మరోసారి ప్రస్తావించవచ్చన్న అనుమానాలు ముందే తలెత్తాయి. ఆ సదస్సులో అందరితో కరచాలనాలు చేసి ఆహ్వానించిన జైశంకర్‌ తీరా భుట్టో దగ్గరికొచ్చేసరికి ముక్తసరి నమస్కారంతో సరిపెట్టడం ద్వారా సభ్యదేశాల కూ ఒక సంకేతం ఇచ్చినట్టయింది.

ఈనెల నాలుగైదు తేదీల్లో గోవాలో షాంఘై కోపరేష న్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. పేరులోనే లక్ష్యం ఇమిడి ఉంది. సహకార సమన్వయ సంస్ధ. ఇందులో ఎనిమిది దేశాలకు సభ్యత్వం ఉంది. భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్‌, రష్యా, ఉజ్బెకిస్తాన్‌, కజకిస్తాన్‌, తజకిస్తాన్‌, కిర్గిస్తాన్‌ దేశాలు ఇందులో భాగస్వాములు. పేరుకి ఎనిమిది సభ్య దేశాలే ఇదొక అంతర్జాతీయ సమీకరణం. మరో నాలుగు దేశాలకు అబ్జర్వర్‌ హోదా ఉంది. మరో తొమ్మిది దేశాల కు డైలాగ్‌ పార్టనర్‌ భాగస్వామ్యం, ఇంకో నాలుగు దేశాలకు అతిధి హోదాతో విస్తృత ప్రాతిపదికన 2001లో ఏర్పాటైన ఈ సంస్ధ గతంలో కన్నా ఇటీవలే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ్యదేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుగొల్పడం, సుహృద్భావ వాతావరణంలో పరస్పర సమస్యలను పరిష్కరించుకో వడం ఈసంస్ధ లక్ష్యం. అంతేనా! రాజకీయం, వాణిజ్యం, విద్య, సైన్సు, ఎకానమీ..ఇలా సమస్త రంగాల్లో పరస్పర అభివృద్దికరమైన అంశాలను పంచుకోవడంతో పాటు ప్రాంతీయ రక్షణకు ఉమ్మడిగా చర్చల ద్వారా తగిన చర్యలు తీసుకోవడం ఉద్దేశంగా ఇది పనిచేస్తున్నది.

ఈ లక్ష్యంలో భాగంగానే గోవాలో ఎస్‌సిఓ విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. భారతదేశం చైర్మన్‌ హోదాలో ఎస్‌సిఓ నుంచి నిర్మాణాత్మక చర్యలను ఆశిస్తున్నది. అందులో భాగంగా రష్యా, చైనాలతో ఎప్పుడు ఏస్ధాయి లో చర్చలు జరిగినా అవి కీలకమే. నిజానికి ఇవి ఎస్‌సిఓ శిఖరాగ్ర సదస్సుకు సన్నాహక చర్చలు మాత్రమే. వివిధ శాఖల మంత్రుల సదస్సుల్లో భాగంగానే విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది. దీనికి పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ హాజరవ్వడంతో ఈ సదస్సుకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలతో ఉభయ దేశాల మధ్య వాతావరణం మరిం తగా ఛిద్రమైన సంగతి తెల్సిందే. దీనికి తోడు సరిహద్దు ల్లో పాకిస్తాన్‌ ప్రాపకపు టెర్రరిస్టుల ఆగడాలు, విధ్వంసా లతో భారతదేశం పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్న ది. 370 ఆర్టికల్‌ ఎత్తివేత వంటి అంశాలను అంతర్జాతీ యం చేస్తూ, కాశ్మీర్‌ను వివాదాస్పద అంశంగా మలిచే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు విఫలమవుతున్నా వదల కుండా షాంఘైకు దాన్ని పరిష్కరించే బాథ్యతను అప్పగించే కుట్రకు అలుపెరుగకుండా ప్రయత్నిస్తున్నది.

గోవా సదస్సుకు పాకిస్తాన్‌ మంత్రి రావడంలో సంస్ధ నైతిక విలువలకు కట్టుబడి ఉండే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నది నగ్నసత్యం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఒంటరి అయిపోయింది. అఎn్గానిస్తాన్‌తో కొత్త తలనొప్పు లు ఎదుర్కొంటున్నది. స్వదేశంలోనే విచ్ఛిన్నకర కార్యక లాపాలను నిరోధించుకోలేని స్ధితిలో అంతర్జాతీయ సమాజానికి సరైన సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. వీటికి మించి ఆర్ధికంగా పతనావస్ధలో కొట్టుమిట్టా డుతున్నది. ఇన్ని సమస్యల మధ్య తానొక ఒంటరినై పోయానన్న బాధను దిగమింగుతూనే పైకి ఒప్పుకోలేక సరికొత్త ఎత్తుగడలకు తెరలేపే ప్రయత్నాల్లో ఉంది. అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవాలన్న తలంపుతో ఉందని యావత్‌ ప్రపంచం కోడై కూస్తున్న తరుణంలో గోవా సదస్సు ఆ దేశానికి అందివచ్చిన ఆయుధంగా పరిణమించింది. కనీసం కొన్ని దేశాల ప్రతినిధులనైనా కలవడం ద్వారా తన ఒంటరితనాన్ని కొంతైనా తగ్గించు కోవాలన్న ఆలోచన కూడా గోవా రాకకు ప్రేరేపించింది. ముఖ్యంగా భారత్‌ కాకుండా రెండు ప్రధాన దేశాలైన రష్యా, చైనా దేశాల విదేశాంగ మంత్రులతో సాన్నిహి త్యం నెరపడం ద్వారా గోవా సదస్సులో కొంత మేరకైనా భారత్‌కు అడ్డుపుల్ల వేయాలన్న తలంపు కూడా దాగి ఉంది. అఎn్గానిస్తాన్‌ అంశం సభ్యదేశాలన్నింటికీ ముప్పు గానే పరిణమించిన నేపథ్యంలో పాకిస్తాన్‌ మీద అంతగా ప్రేమ ఒలకబోసేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి కనబరచ లేదు.

గోవా సదస్సులో పాకిస్తాన్‌ తన గోడు చెప్పుకుని సాయం కోరడం కన్నా భారత్‌ విషయంలో ఆయా దేశాలను ప్రభావితం చేయాలన్న లక్ష్యమే ప్రస్ఫుట మైంది. కాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యంగా భారతదేశం అందుకు అవకాశమివ్వలేదు. భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ అడుగడుగునా ఆ విషయం లో జాగ్రత్తలు తీసుకున్న వైనం స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్‌ విదేశాంగమంత్రి బిలావల్‌ భుట్టో వ్యవహార శైలిని జైశంకర్‌ సభాముఖంగానే దుయ్యబట్టి భారత దేశపు నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మా అతిధి మంచివారైతే మా ఆతిధ్యం మంచిగానే ఉంటుం ది అంటూ చురక అంటించారు. ఒక ఆతిధ్య దేశపు ప్రతినిధి నుద్దేశించి మరొక ఆతిధేయ దేశపు ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలను దౌత్యపరిభాషలో తీవ్రమైనవిగానే పరిగ ణించాలి. దౌత్యపరంగా ఆ ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఎంతగా దిగజారి ఉన్నాయో ఆ మాటలు ప్రతిఫలిస్తాయి. కాని పాకిస్తాన్‌ మంత్రి ఆ వ్యాఖ్యల్లోని తీవ్రతని, సారాన్ని ఒడిసిపట్టుకున్నట్టు లేదు. పాకిస్తాన్‌ నుంచి ఒక సీనియర్‌ మంత్రి భారత్‌లో అడుగుపెట్టడం గత పన్నెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ గౌరవమైతే భుట్టో దక్కించుకున్నారు గాని అందుకు తగ్గట్టు ఆయన ప్రవర్తించలేదని జైశంకర్‌ మాటలను బట్టి అర్దమవుతు న్నది.

బీబీసీ డాక్యుమెంటరీ, ఆర్టికల్‌ 370 వంటి ఎన్నో అంశాలను భుట్టో ప్రస్తావించడం ద్వారా తాను ఎస్‌సిఓ సదస్సుకు వచ్చిన లక్ష్యాన్ని వివరించడంలో విఫలమ య్యారు. అందుకే జైశంకర్‌ పాక్‌ మంత్రి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాల్సి వచ్చిందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. కాశ్మీర్‌ గురించి ఏదైనా మాట్లాడాల్సివస్తే, అది పీఓకే గురించి మాత్రమేనని జైశంకర్‌ ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు తెలియజేశారు. ఒకవంక పాకిస్తాన్‌కు చైనా సానుకూల ధోరణితో సహకా రత్మకంగా ఉంటున్న నేపథ్యంలో బీజింగ్‌ నేతలకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టయింది. ఎస్‌సిఓలో చైనా అండతో ఇతర దేశాల నుంచి కాశ్మీర్‌పై మద్దతు పొందాల నేది పాకిస్తాన్‌ ఎత్తుగడ కాగా, భారతదేశం దీనిమీద మూడోపక్ష ప్రస్తావనకే విముఖమన్న విషయాన్ని మరోసారి అంతర్జాతీయ సమాజానికి చెప్పినట్టయింది.

భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉన్న దాయాది వైరం నేపథ్యంలో పాకిస్తాన్‌ విదేశాంగమంత్రి బిలావల్‌ భుట్టో రాకతో సభ్యదేశాలు సైతం అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్‌ ఐరాస వేదికల మీద ప్రస్తావించే అంశాలు మరోసారి ప్రస్తావించవచ్చన్న అనుమానాలు ముందే తలెత్తాయి. ఆ సదస్సులో అందరితో కరచాలనాలు చేసి ఆహ్వానించిన జైశంకర్‌ తీరా భుట్టో దగ్గరికొచ్చేసరికి ముక్తసరి నమస్కారంతో సరిపెట్టడం ద్వారా సభ్యదేశాల కూ ఒక సంకేతం ఇచ్చినట్టయింది. మొత్తంమీద ఎస్‌సిఓ చైర్మన్‌ హోదాలో గోవా సదస్సులో పాకిస్తాన్‌ ప్రయత్నా లను తిప్పికొట్టడంలో భారత్‌ కృతకృత్యమైంది. పాకిస్తా న్‌ విషయంలో భారత్‌ వైఖరి మారదన్న విషయం మరోమారు సుస్పష్టమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement