Thursday, April 25, 2024

అందరికీ శిరసు వంచి ధన్యవాదాలు: ఈటల

మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న ఆరోగ్యశాఖమంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ అంశంపై  ఈటల ట్విట్టర్ లో స్పందించారు. గత రెండేళ్లుగా, ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ, వైద్య ఆరోగ్యమంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ఈటల ట్వీట్ చేశారు.

కాగా, దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించాడంటూ ఈటల రాజేందర్ పై ఫిర్యాదు అందడం, సీఎం కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించడం తెలిసిందే.  ఈటల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ స్వయంగా చేపడుతున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కూడా తెలిపారు. ఈ క్రమంలో, సీఎం కేసీఆర్ వెంటనే బాధ్యతలు అందుకుని, కరోనా పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతిరోజు మూడు పర్యాయాలు సమీక్ష చేపట్టాలని, కరోనా పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement