Wednesday, April 24, 2024

మునుగోడు దోస్తీతో ప్రశ్నించే గొంతు మూగబోయింది.. క‌మ్యూనిస్టుల‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును ప్రజా సమస్యలపై ప్రశ్నించిన కమ్యూనిస్టులు మునుగోడులో టీఆర్ఎస్‌తో దోస్తీ తర్వాత మూగనోము వహించారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్ధతు తీసుకుని, ఊరూరికి ఒక ఎమ్మెల్యేలు, మండలానికి ఇద్దరు ముగ్గురు మంత్రులను నియమించి జనాన్ని బెదిరించి టీఆర్ఎస్ గెలుపొందిందని సూత్రీకరించారు. బుధవారం ఢిల్లీలో ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కమ్యూనిస్టులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, అందుకే ఆయన చెప్పినట్టుగా ప్రధాని పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లేనిపోని అపోహలు సృష్టిస్తూ సింగరేణి కార్మికులను రెచ్చగొడుతున్నారని అన్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తుంటే వాటిని అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా, కంటకులుగా చరిత్ర పేజీల్లో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు హామీలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారని, ఆచరణలో ఒక్కటీ నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. అందుకే ఓటర్లకు ముఖం చూపలేక ముఖం చాటేస్తున్నారని అన్నారు. రైతు బంధు పేరుతో ఒక పథకం మొదలుపెట్టి రైతులకు ఇతర పథకాల ద్వారా దక్కే ఏ ఒక్క సబ్సిడీని, ప్రయోజనాన్ని అందకుండా చేస్తున్నారని డా. లక్ష్మణ్ ఆరోపించారు. నాణ్యమైన విత్తనాలు అందించడంలో విఫలమయ్యారని, మొత్తంగా రైతులను దగా చేస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్నారని అన్నారు.

- Advertisement -

అందుకే దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలిచిందని సూత్రీకరించారు. ఇంటికొక ఉద్యోగం అంటూ హామీలు గుప్పించి, అసలు నోటిఫికేషన్లే ఇవ్వకుండా మిన్నకున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రారంభమై ఎరువులను ఉత్పత్తి చేస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు మళ్లీ ప్రారంభించడమేంటన్న టీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు బదులిస్తూ.. గత 6 నెలలుగా ట్రయల్ రన్ మాత్రమే జరుగుతోందని, ఇప్పుడు ప్రధాన మంత్రి ఆ కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారని వివరించారు. ఇందులో అభాసుపాలయ్యే అంశమేదీ లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement