Thursday, April 18, 2024

అమెరికా భక్తులకు చేరువగా దుర్గమ్మ పూజలు.. తొలిగా మిల్పిటాస్‌ పట్టణంలో

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరిగే పూజలను అమెరికాలో 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. అమెరికాలోని పది పట్టణాల్లో ఒక్కొక్క పట్టణంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు చేరువ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శ్రీదుర్గామల్లేశ్వర అమ్మవారి, స్వామివార్ల విగ్రహాలు, ఆభరణాలు, పూజా సామాగ్రి బుధవారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో పట్టణానికి చేరుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ దేవదాయశాఖ విదేశీ వ్యవహారాల సలహాదారు చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ప్రతి పట్టణంలోనూ మూడేసి రోజులు అమ్మవారి పూజలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి ప్రధాన అర్చకులు శంకర్‌ శాండిల్య తెలిపారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమార్చన, శ్రీచక్రపూజ, నవ వరావరణ పూజ, లలితా సహస్రనామ పూజతో పాటు శివ, పార్వతీ కళ్యాణం, చండీ హోమం తదితర పూజలు ఆయా ఆలయాల పద్దతులు, అక్కడి నిర్వహకుల నిర్ణయాలకు అనుగుణంగా నిర్వహిస్తామని తెలిపారు.

అమ్మవారి పూజలు అమెరికాలోని భక్తులకు పూర్తిస్థాయిలో అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తొలుతగా శుక్రవారం మిల్పిటాస్‌ పట్టణంలోని శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ అమ్మవారి పూజలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆలయం అధ్యక్షుడు దయాకర్‌ దువ్వూరు తెలిపారు. వేదా టెంపుల్‌గా ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన తమ ఆలయంలో దుర్గమ్మ పూజలు భక్తులకు అందించేందుకు నిర్ణయించినట్లు వ్యవస్థాపక ట్రస్టీ మారేపల్లి నాగవెంకట శాస్త్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement