Saturday, April 20, 2024

భారీ వర్షాలు, తెగుళ్ల దాడితో మిర్చి రైతులకు క‌ష్టాలు.. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవ‌ని ఆవేదన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ సీజన్‌లో మిర్చి రైతులకు కష్టాలు తప్పేలా లేవు. భారీ వర్షాలు పంట ఎదుగుదలను దెబ్బతీయగా పలు రకాల తెగుళ్లు సోకుతుండడంతో దిగుబడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు జిల్లాల్లోని మిర్చి పంటకు తెగుళ్లు సోకి లక్షల్లో రైతులు నష్టపోతున్నారు. ఎకరా మిర్చి సాగుకు రూ.8వేల నుంచి రూ.1, 30వేలదాకా రైతులు పెట్టుబడి పెట్టారు. రాష్ట్రంలోని వరంగల్‌, గోదావరి పరివాహక ప్రాంత నల్లరేగడి నేలల్లో పండే మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. దీంతో రైతులు అప్పులు తెచ్చి మరీ లక్షల్లో పెట్టుబడులు పెట్టి మిర్చి పంటను సాగు చేశారు. భారీ వర్షాలు, పలు రకాల తెగుళ్ల తాకిడితో ఈ సారి మిర్చి పంటపై పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో మిర్చిపంటను రైతులు సాగు చేశారు.

ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో వరి, పత్తి దిగుబడులు తగ్గినట్లుగానే మిర్చి దిగుబడులుకూడా తగ్గనున్నాయి. భారీ వర్షాల కారణంగా మొక్క ఎదగకపోవడం, పూత రాలిపోవడం, మిరప మొక్కలు ఎర్రబారి పోవడం, తోపాటు నల్ల తామర, వివిధ రకాల తెగుళ్లు ఆశించాయి. నల్ల తామర, ఎండు తెగుళ్లు, వేరుకుళ్లు తెగులు,కంకర తెగులు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంటపై దాడి చేస్తున్నాయి. ఈ తెగుళ్ల కారణంగా మిరప మొక్కలు ఎండిపోవడంతోపాటు ఎదుగుదల లోపించడం, కొమ్మలు రాకపోవడంతోపాటు పూత, కాయ రాలుతోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది.

- Advertisement -

గతేడాది జులై, ఆగస్టు నెలల్లో మిర్చి రైతులు సాగును మొదలుపెట్టారు. రెండు నెలలు మొక్కలు ఏపుగానే పెరిగినా ఆ తర్వాత అధిక వర్షాలు పంటను దెబ్బతీశాయి. అధిక తేమతో ఆకు ముడత, నల్ల తామర తెగుళ్లు దాడి చేశాయి. గోదావరి పరివాహక ప్రాంతంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో మిర్చి పంటకు తెగుళ్లు సోకాయి. పలు చోట్ల కంకర తెగులు, నల్ల తామర ఆశిస్తోంది. దీంతోపాటు ఎండు తెగులు కూడా సోకుతోందని రైతులు వాపోతున్నారు. వేరుకుళ్లు తెగులుతో మిర మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. ఫలితంగా వేలాది ఎకరాల్లో మిర్చి పంట ఎండిపోతోంది. ఒక్కో ఎకరా మిర్చి సాగుకు రైతులు రూ.70వేల దాకా ఖర్చు చేశారు. తెగుళ్లు సోకకుంటే ఎకరాకు 25 క్వింటాళ్ల దాకా మిర్చి దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావడం కూడా కష్టమేనని రైతులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement