Saturday, April 20, 2024

త్వరలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. ప్రయోగాత్మకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు టీఎస్‌ ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వరా ప్రయాణికులకు చేరువ అవుతోంది. ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించిన టీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయోగాత్మకంగా 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించనుంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని పలు ముఖ్యమైన పట్టణాలకు విస్తరించాలని యోచిస్తోంది. రెండు దశాబ్దాల కిందటి వరకు హైదరాబాద్‌ నగరంలో రవాణా రంగంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కీలక పాత్ర పోషించాయి. అప్పట్టోనే నగరవాసుల రద్దీని తట్టుకునేందుకు ప్రధాన రూట్లలో ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపింది. ఈ బస్సులు విశేష ఆదరణ పొందాయి. అయితే, వేగంగా హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందడం, అంతకు మించిన వేగంతో జనాభా వృద్ధి చెందింది. దీనికి తోడుగా రోడ్ల విస్తరణ జరగకపోవడం, మెట్రో రైల్‌ సేవలు అందుబాటులోకి రావడం వంటి పలు కారణాలతో డబుల్‌ డెక్కర్‌ సేవలకు ఆర్టీసీ మంగళం పాడింది. అయితే, కొద్ది నెలల క్రితం ఓ నెజిటన్‌ హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిరిగి ప్రారంభించే అంశంపై ఆలోచించాలని ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఈ విషయాన్ని పరిశీలించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కి రీ ట్వీట్‌ చేయడంతో నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిరిగి ప్రారంభించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ తరువాత టీఎస్‌ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిరిగి ప్రారంభించే అంశంపై సర్వేలు నిర్వహించారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. గతంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిచిన రూట్లలో తిరిగి ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టి సారించారు.

ప్రధానంగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు సాఫీగా సాగడానికి విశాలమైన రోడ్లు ఉన్న ప్రాంతాలతో పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్లలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడుపనున్నారు. కాగా, త్వరలో ప్రయోగాత్మకంగా 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకు రానున్న విషయాన్ని టీఎస్‌ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం వంటి పట్టణాలలో సైతం డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపే ఆలోచనలో ఉన్నట్టు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement