Thursday, April 25, 2024

రక్తం కావలెను!

  • ఐపీఎంలో రక్తం నిల్వలు అంతంత మాత్రమే
  • ప్రభుత్వాసుపత్రులకు తగ్గిన సరఫరా
  • రక్త దానానికి ముందుకు రాని దాతలు
  • ప్రైవేటులో ఇష్టారాజ్యంగా వసూలు

హైదరాబాద్‌ నగరంలోని ప్రభుత్వాసుపత్రులైన గాంధీ.. ఉస్మానియా.. నీలోఫర్‌.. నిమ్స్‌ తదితర ప్రభుత్వాసుపత్రులు రక్తం కొరతతో సతమతమవుతున్నాయి… రోజువారి ఆపరేషన్లు.. ఇతర వైద్య అవసరాలకు కావాల్సిన రక్తం అందుబాటులో లేకపోవడంతో పలువురు రోగులు ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌ల్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న పరిస్థి తి నెలకొంది… చిరంజివి బ్లడ్‌బ్యాంక్‌.. రెడ్‌క్రాస్‌ లాంటి కొన్ని సంస్థ లు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నా.. మెజార్టీ బ్లడ్‌బ్యాంక్‌లు అందిన కాడికి దోచుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
– ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి

హైదరాబాద్‌ నగరంలో రక్త నిల్వలు తగ్గడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులైతే రక్తం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌, నిమ్స్‌ తదితర ప్రభుత్వాసుపత్రులకు రక్తాన్ని సరఫరా చేసే ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసన్‌ (ఐపీఎం) సాధారణ సమయాల్లో రోజు వంద యూనిట్ల వరకు రక్తాన్ని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసేది. అయితే గత రెండు నెలలుగా ఈ సంస్థ 50 నుంచి 60 యూనిట్లను మాత్రమే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా నగరంలోని ప్రభుత్వాసుత్రులు రక్తం కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అపరేషన్లు, ఇతర అసరాలకు అత్యవసరంగా రక్తం కావాల్సిన వారు ప్రైవేటు బ్లడ్‌ బ్యాంక్‌లకు అశ్రయిస్తున్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌, రెడ్‌ క్రాస్‌ లాంటి స్వచ్చంద సంస్థలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1800 కంటె తక్కువగా అమ్ముతున్నప్పటికి ప్రైవేటు బ్యాంక్‌లు మాత్రం ఇష్టా రాజ్యంగా వసూలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ముందుకు రాని రక్త దాతలు
గత రెండు నెలలుగా నగరంలో రక్తం నిల్వలు తగ్గుముఖం పట్టడంతో ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రక్త దాతలు రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రాకపోవడంతోనే నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎండాకాలంలో కావడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు అంటున్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న సాదారణ వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని, ప్రతి 15 రోజులకు ఒక సారి ప్లేట్‌లెట్లను దానం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే చాలా మంది ఏడాది ఒక సారి కూడా దానం చేయడం లేదు. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆపోహల వల్లే ముందుకు రాలేక పోతున్నారని తెలుస్తోంది.

క్షేత్ర స్థాయిలో నిఘా కరువు
హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో దాదాపు 80 వరకు బ్లడ్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. బ్లడ్‌ డోనర్లనుంచి వివిధ రూపాల్లో రక్తాన్ని సేకరించి అవసరం ఉన్న వారికి బ్లడ్‌ బ్యాంక్‌లు సరఫరా చేస్తాయి. రక్త సేకరణతో పాటు సరఫరా చేసేందుకు కఠినమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ నిబంధనలకు ఖాతరు చేయకుండా రక్తాన్ని సేకరించడంతో పాటు సర్కార్‌ నిర్ణయించిన ధర రూ.1,800 కంటే అధిక రేట్లకు డిమాండ్‌ను బట్టి అమ్ముతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా బ్లడ్‌ బ్యాంక్‌లపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణ కరువడంతోనే ఇష్టా రాజ్యంగా వ్యవరిస్తున్నట్టు తెలుస్తోంది.

రక్త దానం పై ఆపోహలు వీడాలి : డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, రక్తదాత
రక్త దానంపై ప్రజలు అపోహలు వీడాలి. రక్తం దానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనేవి కేవలం ప్రచారం మాత్రమే. ఆరోగ్యవంతమైన వ్యక్తి పతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని, ప్రతి 15 రోజులకు ఒక సారి ప్లేట్‌లెట్లను దానం చేయవచ్చు. రక్తం,ప్లేట్‌లెట్లు సరైన సమయంలో అం దక ప్రపంచంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు నేను గడిఇన 25 ఏళ్లుగా 277 సార్లు రక్తాన్ని, ప్లేట్‌లెట్లు దానం చేయడం జరిగింది. రక్తదానం మీద ఉన్న అపోహలు వీడి అందరు తమ వంతు సామాజిక బాధ్యతగా రక్తాన్ని దానం చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement