Saturday, April 20, 2024

ప్రతి విషయానికీ సుప్రీంను ఆశ్రయిస్తారా?.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోలేం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఋషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణ రాజుకు చుక్కెదురైంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రతి ఇంచు ప్రదేశానికి కూడా సుప్రీంకోర్టునే ఆశ్రయిస్తారా అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఋషికొండ తవ్వకాలపై హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎదురుచూడాల్సిందిగా పిటిషనర్‌కు హితవు పలికింది. ఈ క్రమంలో పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు వెల్లడించగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌ను డిస్మిస్ చేయవద్దని, ఉపసంహరించుకోడానికి అనుమతివ్వాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించి కేసును ముగించింది.

అంతకు ముందు వాదోపవాదనల్లో భాగంగా తొలుత పిటిషనర్ రఘురామకృష్ణ రాజు తరఫున వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల ప్రకారం ఋషికొండ ప్రాంతంలో గతంలో నిర్మాణాలున్న ప్రాంతంలో మాత్రమే కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొండను తవ్వేస్తోందని చెప్పారు. న్యాయమూర్తులకు కొన్ని ఫొటోలను చూపిస్తూ కొండను ఇప్పటికే 2 కి.మీ మేర తవ్వేశారని వెల్లడించారు. ఇది పూర్తిగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, అలాగే పర్యావరణానికి సైతం తీవ్ర విఘాతం కల్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రతి అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement