Friday, April 19, 2024

కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో వైవిధ్యం.. దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనం

  • రాజకీయం, విద్య, వైద్యం
  • కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో వైవిధ్యం
  • దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనం
  • ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు. పది రోజుల దేశవ్యాప్త పర్యటన చేపట్టిన ఆయన, శనివారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “మీరంతా సంచలనం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అది జరుగుతుంది. మీరే చూస్తారు” అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న తన నివాసానికి అఖిలేశ్ యాదవ్‌ను ఆహ్వానించిన సీఎం కేసీఆర్, రెండు గంటలకు పైగా ఆయనతో అనేకాంశాలపై మంతనాలు సాగించారు. ఈ మధ్యనే జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలిసింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇన్నేళ్లుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీయేనని రాజకీయ వేదికలపై విమర్శలు గుప్పిస్తున్న కేసీఆర్, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజల ఆకాంక్షాలను తీర్చగలిగే ప్రాంతీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం గురించి మాట్లాడుకున్నట్టు తెలిసింది.

నూతన విద్యావిధానం ఏకపక్షం కారాదు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యావిధానంపై కేసీఆర్ విమర్శలు చేశారు. దేశానికి కొత్త విద్యావిధానం అవసరమేనంటూనే కేంద్రం ఏకపక్షంగా ఒక విద్యావిధానాన్ని రూపొందించి అందరి నెత్తిన రుద్దడం సరికాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శనివారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులతో అందరి అభిప్రాయాలు సేకరించి కొత్త విధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వోదయ పాఠశాల గురించి ప్రస్తావిస్తూ.. విద్యార్థులను ఉద్యోగాలు ఆశించే వ్యక్తులుగా కాకుండా, ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పించే శక్తులుగా తీర్చిదిద్దుతున్న విద్యావిధానం చాలా బావుందని ప్రశంసించారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఉన్న దేశానికి ఉపాధి కల్పన చాలా అవసరమని, ఆ దిశగా విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దడం చాలా బావుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలో అధికారులను పంపించి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న, సృజనాత్మక విధానాలపై అధ్యయనం చేయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌తో జరిగిన సమావేశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వ్యాపారస్తులు కలుసుకుంటే వ్యాపారం గురించి, రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకుంటారని, ఇది సహజమని కేసీఆర్ బదులిచ్చారు. అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్‌తో అనేకాంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు.

సర్వోదయ స్కూల్ సందర్శనలో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత ఉన్నారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అతీషితో పాటు ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నూతనంగా నిర్మించిన భవన సముదాయం, అందులో అధునాత సదుపాయాలు, చిన్నారుల కోసం నర్సరీ, ప్లే-స్కూల్ ఏర్పాట్లు, విశాలమైన ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబొరేటరీ, విద్యార్థుల సృజనాత్మకంగా తయారుచేసిన వస్తువులను సందర్శించారు. ఈ క్రమంలో కేసీఆర్ అనేక ప్రశ్నలను సంధించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేజ్రీవాల్, సిసోడియా వివరిస్తుంటే ఆసక్తిగా గమనించారు.

బస్తీ దవాఖానాలతో మెరుగైన ఫలితాలు

- Advertisement -

సర్వోదయ పాఠశాలను సందర్శించిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా అక్కడికి సమీపంలోని మొహల్లా క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్యం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొహల్లా క్లినిక్‌ల ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతోందని కితాబిచ్చారు. ఐదారేళ్ల క్రితం మొహల్లా క్లినిక్ గురించి తెలుసుకుని తెలంగాణ నుంచి అధికారులను పంపించి అధ్యయనం చేశామని, ఇదే తరహాలో హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం 350 బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తున్నాయని, మొహల్లా క్లినిక్, బస్తీ దవాఖానాలతో ప్రజారోగ్యంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. క్లినిక్, పాలీ క్లినిక్ వ్యవస్థ కల్గిన ఈ తరహా వైద్య విధానంలో రోగులకు రోగ నిర్థారణ పరీక్షలతో పాటు మందులు కూడా అందుతున్నాయని అన్నారు. ఇక్కడ చికిత్సకు లొంగని రోగం ఏదైనా ఉంటే పెద్దాసుపత్రికి వెళ్లొచ్చని అన్నారు. మొహల్లా క్లినిక్‌లలో రిటైర్డ్, ప్రైవేటు డాక్టర్ల సేవలను కూడా వినియోగించుకుంటున్నారని, తద్వారా వైద్యుల కొరత లేకుండా రెండు షిఫ్టులలో అందుబాటులో ఉండేలా చేస్తున్నారని కొనియాడారు. ఒక షిఫ్టులో 90-105 మంది రోగులు వస్తున్నారని, అందరికీ వైద్యం అందుతుందని తెలిపారు. విద్య, వైద్యం విషయంలో కేజ్రీవాల్ సృజనాత్మకంగా, వినూత్నంగా చేపట్టిన పథకాలు విజయవంతంగా అమలవుతూ పేద ప్రజల కష్టాలు తీర్చుతున్నాయని తెలిపారు. పేద ప్రజల కోసం కేజ్రీవాల్ చేపట్టిన పథకాలు క్షేత్రస్థాయికి చేరుకుంటున్నాయని, ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. సామాన్యుల కోసం చేపట్టే పనులు కష్టంగా ఉంటాయని, కానీ కేజ్రీవాల్ చేస్తున్న పనులు నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. ఈ తరహాలో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరముందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement