Saturday, April 20, 2024

ఉపాధి నిధుల దారిమళ్లింపు నిజమే.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ప్రశ్నపై కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామి పథకం నిధులను తెలంగాణ ప్రభుత్వం దారిమళ్లించిన మాట నిజమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ (మల్కాజిగిరి) రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించేందుకు 2022 జూన్‌లో కేంద్ర బృందం పర్యటించిందని తెలిపారు. దారిమళ్లించిన నిధులు మొత్తం రూ. 151.91 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికవరీ చేయాలని ఆ కేంద్ర బృందం సిఫార్సు చేసిందని చెప్పారు.

ఉపాధి హామీ పథకం కింద అనుమతి లేని పనులైన ఆహార ధాన్యాలు ఎండబెట్టే ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర బృందం ఇంకా అనేక అవకతవకలను గుర్తించిందని వివరించారు. చాలా తక్కువ మందికి ప్రయోజనం కలిగే పనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర బృందం పేర్కొంది. పూడిక తీత వంటి పనులకు ఉపాధి నిధులు ఎక్కువగా ఖర్చు చేశారని, కానీ పనుల ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరలేదని కేంద్ర బృందం తెలిపింది. అలాగే ఉపాధి హామీ పనుల రికార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయలేదని వెల్లడించింది.

కేంద్ర బృందం పర్యటించిన 7 గ్రామాల్లోనూ గ్రామపంచాయితీ రిజిస్టర్లలో సరైన వివరాలు లేవని కేంద్ర బృందం తన నివేదికలో పొందుపరిచింది. మరోవైపు మార్గదర్శకాల ప్రకారం పనులు పూర్తిచేసిన చోట, నిర్మాణంలో ఉన్న చోట ‘సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు’ ఏర్పాటు చేయలేదని పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement