Saturday, April 20, 2024

కాంగ్రెస్ పార్టీలో పదవుల పంప‌కం.. వచ్చే నెలాఖ‌రులో పూర్తి కార్యవర్గం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హస్తం పార్టీలో పదవుల పందెం మొదలు కానుంది. పార్టీ పదవుల కోసం ఎప్పుడెప్పుడా..? అని ఎదురు చూస్తున్న వందలాది మంది పార్టీ నేతలకు త్వరలోనే మోక్షం పలకనుంది. జూన్‌ చివరి వారంలో పూర్తి స్థాయిలో టీ పీసీసీ కార్యవర్గం వేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు ‘ రైతు రచ్చ బండ ‘ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహించాలని టీ పీసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో డీసీసీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న పార్టీ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని టీ పీసీసీ నాయకత్వం భావిస్తున్నది. డీసీసీల మార్పు విషయం ఎలా ఉన్నప్పటికి.. టీ పీసీసీకి మాత్రం పూర్తి కార్యవర్గాన్ని రచ్చబండ కార్యక్రమం తర్వాత పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాగా పార్టీ పదువుల నియామకంలో సామాజిక న్యాయం పాటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళలకు కూడా పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌లో ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పార్టీ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం టీ పీసీసీ బాధ్యతలను రేవంత్‌రెడ్డికి అప్పగించిన తర్వాత.. 5గురికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు, 10 మందికి సీనియర్‌ ఉపాధ్యక్షులు, మరో 10 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. ఇంకా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. వీటితో పాటు మరో ఐదారుగురిని అధికార ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాలకు కూడా పూర్తి స్థాయి కమిటీలను నియమించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల్లో కొంత మందిని మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా జరగుతోంది. డీసీసీల విషయంలోనూ అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు.

పదవుల నియామకం విషయంలో పార్టీ బలోపేతానికి నిరంతరం ప్రజల్లో ఉండి కష్టపడే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. గాంధీభవన్‌ చుట్టు తిరిగే వారికి, ఫైరవీలు చేసుకునే కొందరు పదవులు పొంది ప్రజల్లోకి వెళ్లకుండా విజిటింగ్‌ కార్డులతో కాలం వెల్లదీసే వారిని పక్కన పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. గత కార్యవర్గంలో ఆ కోవకు చెందిన వారు మెజార్టీగా ఉండేవారని గాంధీభవన్‌ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడలా కాకుండా పార్టీ బలోపేతం కష్టపడి పని చేసే వారిని జిల్లాల వారీగా గుర్తించే పనిలో టీ పీసీసీ నాయకత్వం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటీ వరకు ఉన్న కార్యవర్గంలో టీ పీసీసీ అధికార ప్రతినిధులే దాదాపు 60 నుంచి 70 వరకు ఉండే వారు. ఇక కార్యదర్శులు 100కు పైగానే ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు 24 మంది వరకు ఉండే వారు. ఇప్పుడలా కాకుండా పార్టీ పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటిస్తూ .. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూనే పరిమిత సంఖ్యలో పదవుల పంపిణీ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటీ వరకు నియమించిన టీ పీసీసీ అధ్యక్ష పదవీతో పాటు వివిధ విభాగాల చైర్మన్లలో మెజార్టీగా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేసే కమిటీల్లో సామాజిక న్యాయం చేపట్టి.. ఇప్పటీ వరకు వచ్చిన విమర్శల నుంచి విముక్తి పొందాలని టీ పీసీసీ నాయకత్వం భావిస్తోంది.

మరో మూడు కొత్త కమిటీలు..

ఇప్పుడున్న కమిటీలకు అదనంగా మరో మూడు కమిటీలను వేయాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. ఆ కమిటీలను రాష్ట్ర కాంగ్రెస్‌లో కూడా వేయనున్నారు. పార్టీ అంతర్గత విషయాలు చర్చించేందుకు, పార్టీ శ్రేణులకు శిక్షణ కమిటీతో పాటు మీడియా, సోషల్‌ మీడియాకు అనుసంధానానికి గాను మరో కమిటీని నియమించారు. ఈ కమిటీల వల్ల పదవుల సంఖ్య కూడా పెరుగుతోందని, తద్వారా పోటీ నుంచి విముక్తి లభిస్తోందనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement