Wednesday, April 24, 2024

సైన్యం పహారాలో గ్యాస్‌ పంపిణీ..

శ్రీలంకలో పరిస్థితులకు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. దేశంలో వంటగ్యాస్‌ కోసం ప్రజలు క్యూ కట్టారు. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో పంపిణీ కష్టసాధ్యమవుతోంది. రెండునెలలగా గ్యాస్‌ దొరకడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లేవ్‌ ఐలాండ్‌లో శుక్రవారంనాడు గ్యాస్‌ అందడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితంగా సైన్యం పహారాలో వంటగ్యాస్‌ సరఫరా చేయాల్సి వచ్చింది. సంపన్నులకు, అధికారపక్షానికి చెందినవారికి గ్యాస్‌ అమ్మేసుకుంటున్నారని స్థానికులు తిరగబడ్డారు. తనకు గ్యాస్‌ బండ అంది రెండునెలలు దాటిందని, అప్పటి నుంచి రోజూ క్యూలో నిలబడినా అందలేదని బాధితులు చెబుతున్నారు. నిన్నరాత్రి నుంచి క్యూలో ఉన్నా శుక్రవారం మధ్యాహ్నం వరకు గ్యాస్‌ అందలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఇక విధిలేక సైన్యాన్ని రప్పించి వారి పర్యవేక్షణలో గ్యాస్‌ సరఫరా చేయాల్సి వచ్చింది. రోజురోజుకు పరిస్థితులు దిగజారడంతో మార్చి నెలాఖరునుంచి ప్రజలు ఆందోళనలకు దిగారు.

రోజురోజుకూ ఆ నిరసనలు ఉధృతమయ్యాయి. అధ్యక్షుడు గొటబాయ నివాసానికి సమీపంలోని ఓ పార్కును వేదికగా చేసుకుని ప్రజలు శాంతియుతంగా పోరాడుతున్నారు. దాదాపు అన్నివర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలిచారు. ఏకంగా వెయ్యి ట్రేడ్‌ యూనియన్లు వారికి మద్దతు ప్రకటించి సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులు ఆందోళనకారులపై దాడులకు తెగబడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఈ అల్లర్లలో అధికారపక్షానికి చెందిన ఒక ఎంపీ సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. పరిస్థితులు చక్కబడేవరకు ఆందోళనలు విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. కాగా శనివారంనాడు ఉదయం 6 గంటల నుంచి 12 గంటలపాటు కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకోసం వీధుల్లోకి వచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement