Wednesday, April 24, 2024

ప్రభుత్వ పథకాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ పథకాలలో పోషక విలువలు జోడించిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేద ప్రజలు, మహిళలు, పిల్లలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వారికి అందించాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ఈ బియ్యం కోటా గురించి ప్రకటించారు. 2024 జూన్ వరకు సంవత్సర కాలానికి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 2,700 కోట్లను ఆహార సబ్సిడీలో భాగంగా భరించనుంది. ఇప్పటికే 88.65 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ కోసం ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం సేకరించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశిత ప్రజా పంపిణీ వ్యవస్థ, ఐసీడీఎస్, ప్రధానమంత్రి పోషణ్ శ క్తి నిర్మాణ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర సంక్షేమ పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2024 నాటికి దశల వారీగా పోషక విలువలు కలిగిన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.

మూడు దశల్లో భాగంగా తొలి దశలో ఈ పథకం 2022 మార్చి వరకు ఐసీడీఎస్, పీఎం పోషణ్ కింద దేశమంతటా అమలవుతుంది. 2023 మార్చి వరకు రెండో దశలో 291 జిల్లాల్లో అమలు చేస్తారు. 2024 మార్చి వరకు మూడో దశలో దేశంలోని మిగిలిన జిల్లాలో ఫోర్టిఫైడ్ బియ్యాను పంపిణీ చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం 2019-20 నుంచి ప్రారంభమైన ఈ బియ్యం పంపిణీ మూడు సంవత్సరాల పాటు అమలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ సహా 11 రాష్ట్రాల్లో గుర్తించిన జిల్లాల్లో పైలట్ పథకం కింద ఈ బలవర్థకమైన బియ్యాన్ని విజయవంతంగా పంపిణీ చేశారు.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ పొడిగింపు
అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ను పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పది వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్, 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు, 50 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్‌ల ద్వారా 200 స్టార్టప్‌లకు మద్దతు లభించింది. వీటన్నిటికీ కేంద్రం 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటనకు అనుగుణంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ మిషన్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాల, విశ్వవిద్యాలయం, పరిశోధనా సంస్థలు, ఎం‌ఎస్‌ఎం‌ఈ ద్వారా సృజనాత్మకత, పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్ష్యాలు. మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత నిర్మాణం రెండింటి పైనా ఏఐఎం దృష్టి సారిస్తుంది.

బొగ్గు గనుల కోసం వన్ టైం విండో
సరిగ్గా నడవని బొగ్గు గనులను ఎలాంటి జరిమానా లేకుండానే తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వ కంపెనీలకు వన్ టైమ్ విండోను అందుబాటులోకి తీసుకు రావాలని బొగ్గు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లో ఉన్న అనేక బొగ్గు గనులు ప్రభుత్వానికి తిరిగే దక్కే అవకాశముంది. అలాంటి బొగ్గు గనులన ప్రస్తుత వేలం విధానానికి అనుగుణంగా వేలం వేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement