Wednesday, April 24, 2024

విప్రోలో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారని వేటు

తమ కంపెనీలో పని చేస్తూనే మరో కంపెనీ కూడా పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులకు విప్రో ఉద్వాసన పలికింది. మూన్ లైటింగ్‌గా వ్యవహరిస్తున్న ఈ విధానాన్ని విప్రో మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విప్రోలో ఉంటునే మరో కంపెనీ కోసం పని చేస్తున్న 300 మందిని గుర్తించి, వారిని తొలగించినట్లు విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ప్రకటించారు. మూన్‌లైటింగ్‌ విధానంపై ఐటీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో రషిద్‌ ప్రేమ్‌జీ ఈ విషయాన్ని తెలిపారు. మూన్‌లైటింగ్‌ విధానంపై తాను గతంలో వెల్లడించిన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

విప్రోలో పని చేస్తూ, అదే సమయంలో మరో కంపెనీలో పని చేయడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితే అదే కంపెనీకి ఎదురైతే వారు కూడా ఇలానే స్పందిస్తారని చెప్పారు. మూన్‌లైటింగ్‌ ఏ రూపంలో ఉన్న నైతిక ఉల్లంఘనకు పాల్పడినట్లేనని స్పష్టం చేశారు. మరో ఉద్యోగం చేయడం మోసానికి పాల్పడినట్లేనని రషద్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్‌ కూడా మూన్‌లైటింగ్‌కు అనుమతి ఇవ్వబోమని ఇటీవలే ఉద్యోగులకు లేఖ రాసింది. టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భిన్నంగా స్పందించారు. మూన్‌లైటింగ్‌కు తాము అనుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు. ఐబీఎం కంపెనీ కూడా మూన్‌లైటింగ్‌ విధానాన్ని వ్యతిరేకించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement