Thursday, April 18, 2024

తెలంగాణలో విభిన్న వాతావరణం, నడి వేసవిలో వానాకాలం.. తీవ్రంగా పంట నష్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం లో విభిన్న వాతావరణం నెలకొంది. నడి వేసవిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోగా అకస్మాత్తుగా గులాబ్‌ తుఫాన్‌తోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగాళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడుకోవడం రైతులకు కత్తిమీద సాములా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటివరకు ఎండకాస్తూ, నిర్మలంగా ఉన్న ఆకాశం కాస్త మాయమై ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వాన రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తూ పంటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. వరి, మొక్కజొన్న, మిరప,ఉల్లిగడ్డ, మామిడి, కూరగాయల పంటలు అకాల వర్షాలు, వడగళ్ల వానలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం విలువ రూ.1300 కోట్ల దాకా ఉంటుందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఎక్కువ నష్టం వరిపంటకే…

అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా దెబ్బతిన్నది వరి పంటనే అని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం ప్రాంతంలో వరి పైరు ఈనే దశలో ఉంది. ఆలస్యంగా 0మిగిలిన చోట్ల పొట్ట విచ్చుకుని వెన్నులు మొలకెత్తుతున్నాయి. ఈ ఏడాది యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షలకు పైగానే ఎకరాల్లో వరి సాగు అయింది. ప్రస్తుతం కురుస్తున్న వడగళ్ల వానలు, అకాల వర్షాలకు దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

పెట్టుబడులు కూడా వస్తాయో రావో : మొక్కజొన్న రైతుల ఆవేదన

వరి తర్వాత మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా జిల్లాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. మొక్కజొన్న నేలవాలితే పంట చేతికందడం కష్టమని, కంకుల్లో గింజ గట్టిపడే దశలో వడగళ్ల వానకు మొక్కజొన్న మొక్కలు నేలవాలడంతో కంకిలో గింజ గట్టిపడదని, కంకి మురిగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాల దెబ్బకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు.

ఈసారి కాసిందే తక్కువ… అది కూడా వడగళ్లకు నేలపాలు

అసలే ఈ సారి మామిడి తోటల్లో చాలా తక్కువగా కాత నిలిచింది. ఉన్న ఆ కాస్త పూత కూడా కాయలు గా ఎదుగుతున్న దశలో వడగళ్లవాన, భారీ ఈదురుగాలులు వీయడంతో కాయలు, పూత కూడా నేలరాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆర్థికసాయం చేసి తమను ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముమ్మరంగా పంట నష్టం అంచనా సర్వే…

వరుసగా నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తుండడం మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పంట నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మండలాల వారీగా వ్యవసాయ విస్తరణాధికారి (ఏవో) నేతృత్వంలో ఏఈవో (సహాయ వ్యవసాయ విస్తరణాధికారి) తోపాటు రెవెన్యూశాఖలోని సర్వేయర్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ స్థాయి అధికారులు రంగంలోకి దిగి పంట నష్టం అంచనాలను రూపొందిస్తున్నారు.

ఆయా మండలాల్లో దెబ్బతిన్న వరి, కూరగాయలు, ఉద్యాన తదితర పంటలను రైతులు ఏ మేరకు నష్టపోయింది సేకరించడంతోపాటు పిడుగులు పడి పశువులు మృతిచెందిన సమాచారాన్ని కూడా సేకరించి జిల్లాల వారీగా వ్యవసాయశాఖకు, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి మండలాల వారీగా వ్యవ సాయశాఖకు పంట నష్టంపై నివేదికలు అందాయి. అకాల వర్షాలకు కరీనంగర్‌, వరంగల్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement