Saturday, March 25, 2023

యావద్దేశానికి ఆదర్శంగా రాష్ట్రాభివృద్ధి.. తెలంగాణ భవన్ గణతంత్ర వేడుకల్లో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సరికొత్త రాష్ట్రంగా అవతరించి అతి తక్కువ కాలంలో వివిధ రంగాల్లో విశేష ప్రగతి సాధించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు జరిగిన కర్తవ్యపథ్, ఇండియాగేట్‌కు అతి సమీపంలో ఉన్న తెలంగాణ భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ ముందుగా పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రపంచములోనే గొప్ప సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలిచిందని అన్నారు.

దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, దళిత బంధు, కంటి వెలుగు, గ్రామీణ వృత్తి దారులను ప్రోత్సహించడం వంటి ఎన్నో వినూత్న పథకాలను అమలుచేస్తోందని తెలిపారు. భవిష్యత్‌ తరాలకు మంచి పరిసరాలను, మంచి వాతావరణాన్ని అందించాలి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారన్నారు.

- Advertisement -
   

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకోసం ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు టి.ఎస్‌ – ఐ.పాస్‌ సింగిల్‌ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉందని, కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులు అందుతున్నాయని వెల్లడించారు. ఈ నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోకి అనేక కొత్త పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలో హైదరాబాద్‌ నగరం ఒక ప్రముఖ ఐటీ హబ్‌ గా గుర్తింపు పొందిందని తెలిపారు హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ రంగాన్ని ప్రభుత్వం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోందని చెప్పారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టి-హబ్‌ ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తోందని చెప్పారు.

మరోవైపు ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ రాష్ట్రం వెలుపల తెలంగాణ ప్రజలు ఆపదల్లో చిక్కుకున్న సందర్భాల్లో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని గౌరవ్ ఉప్పల్ తెలిపారు. కోవిడ్ కష్ట కాలంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజలను రాష్ట్రానికి చేర్చేందుకు భవన్ సిబ్బంది నిర్విరామంగా పనిచేశారని గుర్తుచేశారు. ఉక్రెయిన్ యుద్ద సంక్షోభ సమయంలో  ఆ దేశంలో చిక్కుకున్న  తెలంగాణ విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి క్షేమంగా చేర్చేందుకు వివిధ ఎంబసీలతో మాట్లాడి, ఢిల్లీకి చేరుకున్న తర్వాత వారికి భోజనం, వసతి, కల్పించి ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి పంపించామని తెలిపారు. పరిమితమైన మానవ వనరులు ఉన్నప్పటికీ చాలా సమర్ధవంతంగా పని చేస్తున్నారని సిబ్బందిని అభినందిస్తూ, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో మరింత నిబద్ధతతో పని చేసి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని డా.గౌరవ్ ఉప్పల్ కోరారు. ఈ వేడుకలలో ఢిల్లీలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మందా జగన్నాధం, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజు ఇతర అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement