Thursday, April 25, 2024

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంకి తెలంగాణతో లింకులు.. లిస్ట్‌లో హైదరాబాద్‌ ప్రముఖ వ్యాపారవేత్త పేరు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడే ఘటన జరిగినా హైదరాబాద్‌తో లింకులు బయటపడడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ మద్యం పాలసీ స్కాం కేసులోనూ తెలంగాణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత నవంబర్‌లో ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు దాడులు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మనీష్ సిసోడియాతో పాటు 15 మందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రాంచంద్ర పేరును కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. లిక్కర్ స్కాంలో సిసోడియా ఏ1 కాగా, ఏ14 గా రాంచంద్ర పిళ్లై పేరును చేర్చారు. రాంచంద్ర పిళ్లై ఇండో స్పిరిట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. మద్యం టెండర్ దక్కించుకోవడానికి అరుణ్ పాండ్యే అనే వ్యక్తి ద్వారా సిసోడియా రూ. 2.50 కోట్లు వసూలు చేసినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. హైదరాబాద్, బెంగళూరులోని రాంచంద్ర పిళ్లై కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసుతో సంబంధమున్న దేశవ్యాప్తంగా 31 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. ఢిల్లీ, గుర్గావ్, చండీఘడ్, ముంబై, లక్నో, హైదరాబాద్, బెంగళూరులోని 10 లిక్కర్ కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో దాడులు చేస్తున్నారు. లిక్కర్ లైసెన్స్ జారీల్లో భారీ ఎత్తున అవకతవకలు, భార్యలు, బినామీల పేర్లపై లిక్కర్ లైసెన్స్‌లు, లైసెన్స్‌ల కోసం భారీగా ముడుపులు సమర్పించడం, అనుమతులు తీసుకోకుండానే లైసెన్స్‌లు జారీ చేసినట్టు సీబీఐ గుర్తించింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి.

బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..

ఓవైపు సిసోడియా ఇంట్లో దాడులు కలకలం రేపుతుంటే మరోవైపు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. కొత్త పాలసీ రూపకల్పన విషయంలో తెలంగాణలోనే అన్ని వ్యవహారాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల దందా తెలంగాణలో జరుగుతుందన్నారు. మద్యం పాలసీ అవకతవకలతో తెలంగాణకు సంబంధం ఉందన్న పర్వేష్, హైదరాబాద్‌లో బుక్ చేసుకున్న హోటల్, రెస్టారెంట్లను మనీష్ సిసోడియా సందర్శించి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. 10 నుంచి 15 మంది ప్రైవేట్ ప్లేయర్లు, ప్రభుత్వ వ్యక్తులు, మనీష్ సిసోడియా దీని వెనుక ఉన్నారని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

టీఆర్‌ఎస్ నేతల్లో గుబులు..

పర్వేష్ వర్మ ఆరోపణలతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలోని టీఆర్ఎస్ నేతల మెడకూ చుట్టుకోబోతోందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొందరు కీలక టీఆర్ఎస్ నేతల ప్రమేయం కూడాట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారంతా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement