Saturday, April 20, 2024

Delhi | ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం నేతల వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాల కోసం రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలని, ఓబీసీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌ను కోరారు. సోమవారం వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన మరో ఎంపీ బీద మస్తాన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతలు కర్రి వేణుమాధవ్, డాక్టర్ పద్మలత, పరుశురాం తదితరులు ఒక బృందంగా వెళ్లి ఎన్సీబీసీ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేసిన బీసీ సంక్షేమ సంఘం.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆయా వర్గాల అభివృద్ధి కుంటుపడిందని తెలిపింది.

దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి 56 శాతం జనాభాను అవమానించిందని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ ఓబీసీల అభివృద్ధికి 40 సిఫార్సులు చేయగా అందులో ఆర్థికాభివృద్ధికి 16 సిఫార్సులు ఉన్నాయని, కానీ ఇంతవరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు, స్కాలర్‌షిప్‌లు,  ఫీజు మంజూరు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, మంజూరుకు బడ్జెట్ కేటాయించడం లేదని అన్నారు.

- Advertisement -

ప్రత్యేక హాస్టళ్ళు – విద్యా సంస్థలు లేకపోతే బీసీలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. ఐఐటీ, ఐఐఎంతో పాటు వైద్యవిద్యను అభ్యసించే బీసీ విద్యార్థులు రిజర్వేషన్ల ద్వారా అడ్మిషన్లు పొందినప్పటికీ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే బీసీ పథకాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్సీబీసీ చైర్మన్‌ను కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement