Saturday, April 20, 2024

ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం.. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ తర్వాతే ప్రకటన?

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని నాలుగు రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ట్రిపుల్‌ ఐటీ)ల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల జాప్యం కానుంది. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తర్వాతే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్జీయూకేటీ పరిధిలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయల్లో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలు కొవిడ్‌ ముందువరకు పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగానే కేటాయించేవారు. కొవిడ్‌ రెండేళ్లు పది పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించడంతో ట్రిపుల్‌ ఐటీ లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేసి ట్రిపుల్‌ ఐటీ సెట్‌ నిర్వహించి, అందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించింది.

సప్లిమెంటరీ తర్వాతే?

2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంతోపాటు ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. అయితే ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గిందన్న విమర్శలు రావడంతో నెల రోజుల్లోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు, నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. మరోవైపు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనా వారిని రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్లుగానే పరిగణిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే ప్రకటించారు. అలాగే 49, అంతకన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు సప్లిమెంటరీ విద్యార్థులతోపాటు బెటర్‌మెంట్‌ పరీక్ష రాసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. దీంతో ఈ పరీక్షల్లో బెటర్‌మెంట్‌ రాసే విద్యార్థులకు కూడా మార్కులు పెరిగే అవకాశం ఉంది. కనుక అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌, రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ తర్వాతే ట్రిపుల్‌ ఐటీ-లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నుంచి ట్రిపుల్‌ ఐటీ ల్లో ప్రవేశాలను పదో తరగతి మార్కుల ఆధారంగానే జరిగే చేపట్టనున్నట్లు సమాచారం. ఆర్జీయూకేటీ- పరిధిలో ఒక్కో ట్రిపుల్‌ ఐటీ లో 1100 సీట్ల చొప్పున ఉన్నాయి. వీటి భర్తీ కోసం దీనిపై త్వరలోనే స్పష్టతనిస్తూ నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement