Friday, April 19, 2024

Big Story | ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం.. అన్‌లోడింగ్‌లో మిల్లర్ల లేట్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అడుగడుగునా రవాణా కష్టాలు వెంటాడుతున్నాయి. కాంటా అయ్యాక కనీసం వారం తర్వాతే ధాన్యం మిల్లుల్లో అన్‌లోడ్‌ అవుతుండడంతో రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రభుత్వం, జిల్లా అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా మిల్లుకు చేరుకున్న ధాన్యం లోడ్‌ లారీ అన్‌లోడింగ్‌కు నాలుగైదు రోజులు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాము చెప్పినంత మేర తరుగుకు అనుమతిస్తేనే త్వరగా అన్‌లోడింగ్‌ చేస్తామన్న మిల్లర్ల పేచీ కారణంగానే అన్‌లోడింగ్‌లో జాప్యం నెలకొని అంతిమంగా కొనుగోళ్లు జాప్యమయ్యేందుకు దారితీస్తోందని అధికారులు, రైతులు మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న రైసు మిల్లుల్లో ధాన్యం నిండిపోవడంతో సేకరించిన ధాన్యం దిగుమతికి మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఫలితంగా కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం నెలకొంటుడడంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోళ్లను వేగిరంగా నిర్వహించాలని పలుచోట్ల రైతులు నిత్యం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఖరీఫ్‌ సాగు పనులకు ఆటంకం…

అదే సమయంలో ఖరీఫ్‌ సాగు పనులు సమీపించిన వేళ అకాల వర్షాలకు నష్టపోను మిగిలిన కొద్దిపాటి పంటను కూడా సకాలంలో అమ్ముకోలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి రోహిణి కార్తె నుంచి ఖరీఫ్‌ సాగు పనులు ముందుగా వేసవి దుక్కులతో ప్రారంభమవుతాయి. రోహిణి కార్తె ఈ నెల 25న ప్రారంభమై నాలుగైదు రోజులు గడిచిపోతున్నాయి. అక్కడక్కడా కురుస్తున్న జల్లులకు భూములను పోతం (వేసవి దుక్కులు) సిద్ధం చేసుకోవడంతోపాటు విత్తనాల కొనుగోలు, వాటిని ఆరబోసి నారుకు సిద్ధం చేయడం, నారు మళ్లు దున్నుకోవడం వంటి పనులు మొదలు పెట్టాలి. అయితే యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.

ధాన్యం అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఖరీఫ్‌ సాగు పనులు మొదలు పెడదామనుకున్న రైతులకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిరాశకు గురి చేస్తోంది. ఖరీఫ్‌ సాగు పనులు అదను సగం దాటాకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల తాలూకు డబ్బులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు రైతులను వెంటాతుండడం, మరో అయిదు రోజులపాటు అకాల వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోంది. ఒకవేళ వర్షం వస్తే ధాన్యం రాశిని ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలీచాలని టార్పలిన్‌లతో అవస్థలు పడుతున్నారు. 16శాతం తేమ వచ్చే వరకు ఎండబెట్టి ధాన్యాన్ని బస్తాల్లో నింపామని, తీరా వర్షం రావడంతో మళ్లిd ఆరబోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుత యాసంగిలో ఇప్పటి వరకు 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం 7వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు తెరవగా , దాదాపు 150కు పైగా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మరో వారం, పది రోజుల్లో 2023-24 యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement