Tuesday, April 23, 2024

అప్పులు తీర్చలేం, పరిస్థితి చక్కబడ్డాక చెల్లిస్తాం.. విదేశీ రుణాలపై చేతులెత్తేసిన శ్రీలంక

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పీకలదాకా కూరుకుపోయిన శ్రీలంక విదేశీ రుణాలను ఇప్పటిక్పుపుడు చెల్లించలేమని చేతులెత్తేసింది. దేశీయ, విదేశీ ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు, రుణదాతలకు ఈ విషయం స్పష్టం చేసింది. పేరుకుపోయిన రుణ బకాయిలను డిఫాల్ట్‌గా ప్రకటించింది. మొత్తమ్మీద 51 బిలియన్‌ డాలర్ల మేర అప్పులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మంగళవారం ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. పరిస్థితులు చక్కబడ్డాక చెల్లింపులపై దృష్టి సారిస్తామని, గతంలో తమ దేశం ఎప్పుడూ ఎలా విదేశీ రుణాలను ఎగవేయలేదని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నుంచి తెరిపినిచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్‌ఔట్‌ ప్యాకేజీని ప్రకటించనున్న నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజుల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా ఖాళీ కానున్నాయని, ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించే అవకాశం లేదని ఆర్థికశాఖ వెల్లడించింది.

ఆ నిధులను ప్రజలకు ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల దిగుమతికోసం వెచ్చించాల్సి ఉందని, దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోకుండా చూసేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా శ్రీలంక ఎక్కువగా చైనా, జపాన్‌, భారత్‌లతో పాటు మరికొన్ని విదేశీ సంస్థలనుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. మొత్తం అప్పుల్లో చెరో పది శాతం చైనా, జపాన్‌లనుంచే ఉండగా, 5 శాతం భారత్‌కు చెల్లించాల్సి ఉంది. మార్చినెలాఖరునాటికి శ్రీలంక వద్ద 1.9 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండగా వెంటనే చెల్లించాల్సిన అప్పులు 7 బిలియన్‌ డాలర్లు. 2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ తరువాత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఆ ద్వీపదేశానికి ఇదే తొలిసారి. మరోవైపు ఆహార పదార్థాలు, ఔషధాలు, పెట్రో ఉత్పత్తుల కొరత, విద్యుత్‌ కోతల నేపథ్యంలో ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మరింత తీవ్రమైనాయి.

మంగళవారంనాడు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. కాగా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నామని, విదేశీ మారక నిల్వలు పెరగాలన్నా, పర్యాటక రంగం కోలుకోవాలన్నా ఆందోళనలు విరమించాలని ఆందోళనకారులకు ప్రధాని మహింద రాజపక్స పిలుపునిచ్చారు. అప్పుడే ఆర్థికంగా దేశం పుంజుకునే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. కాగా కొద్దిరోజులుగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు తిరిగి ప్రభుత్వపక్షంలో మంగళవారంనాడు చేరిపోయారు. వీరిలో శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీకి చెందిన శాంతబండారతో పాటు మరొకరు ఉన్నారు. కాగా ప్రధానిగా మహింద రాజపక్స తప్పుకుంటే సంకీర్ణ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని విపక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

శ్రీలంకకు చేరిన 11వేల టన్నుల భారత్‌ బియ్యం
భారత్‌లోని కాకినాడ పోర్టునుంచి 11వేల మెట్రిక్‌ టన్నుల బియ్యంతో బయలుదేరిన నౌక కొలంబోకు మంగళవారంనాడు చేరుకుంది. ఈ విషయాన్ని అక్కడి భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. బుధ, గురువారాల్లో శ్రీలంక నూతన సంవత్సరాది వేడుకల నేపథ్యంలో భారత్‌నుంచి బియ్యం చేరుకోవడం కొంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు నరేంద్రమోడీప్రభుత్వం 16వేల టన్నుల బియ్యాన్ని సంక్షుభిత శ్రీలంకకు అందజేసింది.

దేశం కష్టాల్లో ఉంటే ఐపీఎల్‌ ఆడతారా?
దేశం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉంటే కొందరు క్రికెటర్లు భారత్‌లో జరుగుతున్న ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో పాల్గొనడం సరికాదని, ఒక వారంపాటు ఆ పోటీలకు విరామం ఇచ్చి దేశంలో ఆందోళనలు చేస్తున్న ప్రజలకు సంఘీభావంగా దేశానికి రావాలని పిలుపునిచ్చారు. చాలామంది ప్రభుత్వ ఆధిపత్యంలోని క్రికెట్‌బోర్డులో పనిచేస్తున్నారని, వారి ఉద్యోగాలు కాపాడుకునేందుకు, విలాసవంతమైన జీవితాలు గడిపేందుకు ఐపీఎల్‌కు హాజరవుతున్నారని, కానీ దేశంలోని అత్యధికులు తిండీతిప్పలు లేక ఇబ్బందులుపడుతూ రోడ్డెక్కారని అన్నారు. ఈ పరిస్థితుల్లో జూనియర్‌, సీనియర్‌ క్రికెటర్లు దేశానికి వచ్చి ఆందోళనకారులకు సంఘీభావంగా ప్రకటనలు చేయాలని అర్జున రణతుంగ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement