Wednesday, April 24, 2024

దళిత బంధు పథకం.. మ‌రో నాలుగు మండ‌లాల్లో అమ‌లు

తెలంగాణలో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలోని చింత‌కాని మండ‌లం, సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి మండ‌లం, నాగర్‌క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చార‌గొండ మండ‌లం, కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని నిజాం సాగ‌ర్ మండ‌లాలను ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద‌రాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.

ఇది కూడా చదవండి: 17 రంగులు, 15 డిజైన్‌లలో బతుకమ్మ చీరలు సిద్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement