Thursday, April 25, 2024

డిజిటల్ మెంబ‌ర్‌షిప్‌కు సీడ‌బ్ల్యూసీ ఆమోదం.. చింతన్ శిబిర్ కోసం రోడ్ మ్యాప్ సిద్ధం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ కోసం కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడమే లక్ష్యంగా ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ ఏర్పాటవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయ్‌పూర్‌లో ఈ నెల 12 నుంచి జరగనున్న చింతన్ శిబిర్ కోసం సన్నాహక సమావేశంలా వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. పార్టీ పునర్నిర్మాణం కోసం కొత్త రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడమే లక్ష్యంగా చర్చలు జరిపినట్టు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటూ పార్టీలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ జరగనుందని సూర్జేవాలా తెలిపారు. చింతన్ శిబిర్‌లో చర్చించాల్సిన 6 ప్రధానాంశాల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 6 విభిన్న బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, భారీ పరిధి ఉన్న రాజకీయాంశాలు, రైతులు, రైతు కూలీల సమస్యలు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు బలం చేకూర్చడం, కాంగ్రెస్‌లో సమగ్ర సంస్థాగత మార్పులు, యువత వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు 6 బృందాలకు చెందిన కన్వీనర్లు పాయింట్ల వారీగా తమ నివేదికను అందించారని సూర్జేవాలా తెలిపారు.

చింతన్ శిబిర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, శాసన మండలిలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షులు, కేంద్ర క్యాబినెట్ మాజీ మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఏఐసీసీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, లోక్‌సభ సభ్యలు, రాజ్యసభ సభ్యులు ఇలా మొత్తం 422 మంది పాల్గొంటారని సూర్జేవాలా చెప్పారు. వీరిలో 50 ఏళ్ల లోపు 50 శాతం మంది, 40 ఏళ్ల లోపు 30-35 శాతం మంది ఉన్నారని, అలాగే మొత్తం ప్రతినిధులలో 21 శాతం మంది మహిళలేనని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని సూర్జేవాలా తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో డిజిటల్ మెంబర్‌షిప్ దాదాపు పూర్తయిందని, ఈ ప్రక్రియ ఇకమీదట కూడా కొనసాగుతుంది అని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యాంగంలో ఇందుకు తగిన అవసరమైన మార్పును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిందని సూర్జేవాలా అన్నారు. లడఖ్ ప్రత్యేక కమిటీని కూడా సీడబ్ల్యూసీ ఆమోదించిందని అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement