Friday, March 29, 2024

Cristiano Ronaldo: అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు..

ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. ఫుట్‌బాల్‌ చరిత్రలో దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసి రొనాల్డో తొలిస్థానానికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం ఫిపా లెక్కల ప్రకారం రొనాల్డో 180 మ్యాచ్‌లలో 111 గోల్స్‌తో టాపర్‌గా ఉన్నాడు. ఇరాన్‌కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచ్‌లలోనే 109 గోల్స్ సాధించి రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్‌లలో 89 గోల్స్‌తో మూడోస్థానంలో ఉన్నాడు. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం రాత్రి రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్‌ చేయడం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు. ఇదే మ్యాచ్ ద్వారా పోర్చుగల్ తరపున అత్యధిక మ్యాచ్‌లు (180) ఆడిన సెర్జియో రామోస్ రికార్డును రొనాల్డో సమం చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని రొనాల్డో గోల్‌గా మలచలేకపోయాడు. అయితే 45వ నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు ఇగాన్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యత తీసుకొని వచ్చాడు. రెండో అర్ద భాగంలో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. పోర్చుగల్ జట్టు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా రొనాల్డో తన మ్యాజిక్‌ను చూపించాడు. ఆట 89వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో హెడర్‌తో గోల్ కొట్టి పోర్చుగల్‌కు తొలి గోల్‌ను అందించాడు. అదననపు సమయం ఆట(90+6) నిమిషంలో రొనాల్డో మరో గోల్‌ కొట్టడంతో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి 2-1తో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక తన కెరీర్‌లో ఆఖరి 15 నిమిషాల్లో రొనాల్డో 33 గోల్స్ చేయడం విశేషం. ఇక రొనాల్డో ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత జూవెంటస్‌ క్లబ్‌ నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు మారిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:Tollywood drug case: ఈడీ విచారణకు హాజరైన చార్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement