Tuesday, March 26, 2024

కార్పొరేట్‌ జిమ్మిక్కులు షురూ! వాళ్లు ఫిక్స్‌ చేసిన ఫీజే ఫైనల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీలు, పాఠశాలలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేశాయి. 2022-23 విద్యా సంవత్సరం ముగియడానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉండగానే కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీలు, పాఠశాలలు రాబోయే 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా చేపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ముగియక ముందే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా కొన్ని విద్యా సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తుండడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మార్చి 15 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు, ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. వార్షిక పరీక్షలు పూర్తవ్వనేలేదు.. సెలవులివ్వనేలేదు..అప్పుడే అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేపాయి. తమ కార్పొరేట్‌ జిమ్మిక్కులతో ప్రకటనతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే పదో తరగతి విద్యార్థులకు తమకు అనుబంధంగా ఉన్న కాలేజీల్లొనే అడ్మిషన్లు తీసుకోవాలని వారిపై ఒత్తిడి తెెస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

ఇక పాఠశాలల్లోనైతే ముందస్తుగా ప్రైమరీ, ఆపై తరగతులకు అడ్మిషన్లు తీసుకుంటే రాయితీ కూడా ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పుడే అడ్మిషన్‌ పొందితే ఫీజులో తగ్గింపు ఉంటుంది. తీరా అడ్మిషన్లు అయిపోయే సమయానికొస్తే మాత్రం ఫీజులో రాయితీ ఉండకపోగా తాము చెప్పిందే ఫైనల్‌ అనేలా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరం ముగింపుకొస్తుందంటే చాలూ ప్రత్యేకమైన టీంలను పెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు ఎక్కడున్నారో తెలుసుకొని మరీ అక్కడ వాలిపోతుంటారు. మంచి ఫ్యాకల్టి, మంచి స్కూల్‌ వాతావరణం..మంచి భోజనం ఉంటుందంటారు. చదువు మాత్రమే కాదు ఆటలు కూడా ఆడిస్తామని చెప్పి ఏదోలా అడ్మిషన్లను నింపుకునే ప్రయత్నాలను కొన్ని జూనియర్‌ కాలేజీలు, స్కూళ్లు చేస్తుంటాయి. కానీ తీరా అడ్మిషన్లు పొందిన తర్వాత తమ పిల్లలు స్కూలు, కాలేజీకి వెళ్లిన తర్వాత అడ్మిషన్‌కు ముందు ఇచ్చే హమీలన్నీ పక్కకుపోతాయి. కొన్ని విద్యా సంస్థలకు అర్హత గల ఫ్యాకల్టి ఉండదు. ఒకవేళ ఉన్నా తరగతులకు సరిపడా ఫ్యాకల్టి ఉండరు. ఇక గ్రౌండ్‌ చూద్దామంటేనే కనబడదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు ఉదయం పూట జరిపే ప్రేర్‌కే (సమావేశం కావడానికి) సరిపడా స్థలం కూడా ఉండదు.

- Advertisement -

వాళ్లు ఫిక్స్‌ చేసిందే ఫీజు…!

2022-23 విద్యా సంవత్సరానికి దాదాపు ఇంకా రెండు నెలల గడువుండగానే కొన్ని స్టేట్‌, సెంట్రల్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు అడ్మిషన్లను అప్పుడే తీసుకుంటున్నాయి. పాఠశాల పేరేంట్స్‌ గ్రూపుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటనలను హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రముఖ పాఠశాలలు ఏకంగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగియక ముందే రాబోయే విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లను చేపడుతూ అడ్మిషన్లను కొరతను సృష్టించి ఫీజులను వసూలుకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో బడిబాట కార్యక్రమం వేసవి సెలవులు ముగిశాక జూన్‌లో ప్రారంభమవుతోంది. ఈ బడిబాటలో వివిధ తరగతులకు అడ్మిషన్లను టీచర్లు తీసుకుంటారు. కానీ కొన్ని ప్రైవేట్‌ బడుల్లో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ డిసెంబర్‌ నెల నుంచే ప్రారంభించేశాయి. ఇప్పుడైతేనే ఫీజులు తక్కువగా తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎరవేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించాలంటే సగటు పేరెంట్‌ ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యథేచ్చగా సాగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది.

దీంతో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు, ఫీజుల నియంత్రణ జీవోలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు దాదాపు 10 వేలు నుంచి 11 వేల మధ్య ఉన్నాయి. విద్య పేరుతో రాష్ట్రంలో ఏటా రూ.12.50 వేల కోట్ల విద్యావ్యాపారం జరుగుతున్నట్లు ఓ అంచనా. ఈ ఏడాది ఫీజు వచ్చే ఏడాది ఉండట్లేదు. ఇలా తమ ఇష్టానుసారంగా ఫీజులను 10 నుంచి 50 శాతం వరకు ఒక తరగతి నుంచి పైతరగతికి మారుతున్నప్పుడల్లా పెంచుతూ పోతున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్‌, ట్రాన్స్‌పోర్టు ఫీజులు వీటికి అదనం. ప్రైవేటు స్కూల్‌ ఫీజులపై చట్టం తీసుకొచ్చేందుకు నియమించిన మంత్రుల సబ్‌ కమిటీ ఈ విషయాన్ని ఎటూ తెల్చలేదు. దీంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలు, పాఠశాలలు తాము ఆడిందే ఆట..తాము ఫిక్స్‌ చేసిందే ఫీజు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విద్యార్థి, పేరెంట్స్‌ సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదైనా ప్రైవేట్‌ విద్యా సంస్థల ఫీజులకు కళ్లెం పడుతుందో లేదో చూడాలి మరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement