Friday, April 19, 2024

విస్తరిస్తున్న కరోనా, రోజూ 500కు పైగా కేసులు, తాజాగా 441 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో కరోనా వైరస్‌ మళ్లి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ పోయిందన్న భావన ప్రజల్లో నెలకొనడంతో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్‌ జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. నెల రోజులుగా పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర రాజధాని ముంబయి, కేరళ, తమిళనాడు, ఢిల్లి రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లి పెరుగుతున్నాయని తెలిసినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా హై’దరాబాద్‌, మేడ్చల్‌ -మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, హన్మకొండ, మంచిర్యాల తదితర జిల్లాల్లో ప్రతీ రోజూ రెండు అంకెల సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. ప్రస్తుతం వైరస్‌ సోకినా తీవ్రత తక్కువగా ఉండడంతో కరోనా బారిన పడుతున్న వారు పరీక్షలు చేయించుకుని వైద్యులతో మందులు రాయించుకుని ఇంటి వద్దే కోలుకుంటున్నారు. దీంతో ప్రజల్లో కరోనా వైరస్‌పై భయం తొలగిపోవడంతో కొవిడ్‌ జాగ్రత్తలను పక్కన బెట్టేస్తున్నారు. కొవిడ్‌ జాగ్రత్తలను విస్మరించడంతోపాటు ఇటీవల వర్షాలకు మారిన వాతావరణం, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పండగుల సీజన్‌తో వైరస్‌ మళ్లి విజృంభిస్తోంది. హైదారబాద్‌లో ప్రతీ దాదాపు 300 దాకా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయిదు రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.

తాజాగా 441 కొత్త కేసులు నమోదు..

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా441 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 692 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4649కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 21, 616 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో272 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 15, కరీంనగర్‌ 4, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 26, రంగారెడ్డిలో 21, సంగారెడ్డిలో 9 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement