Wednesday, April 17, 2024

Delhi: అకాడమీల మధ్య సమన్వయం అవసరం.. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో సాంస్కృతిక, సాహిత్య వికాసం జరిగేందుకు వివిధ అకాడమీల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అకాడమీలన్నీ కలిసి ప్రతి రెండు, మూడు నెలలకోసారి సమావేశమై తమ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. సోమవారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ అకాడమీలతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, వారణాసి, పుణే, గౌహతిల్లో ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం తదితర అంశాలపై అధికారులు కిషన్ రెడ్డికి వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జోనల్ కల్చరల్ సెంటర్ల ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలను రెండు, మూడు జోన్ల పరిధిలోకి విభజించిన కారణంగా తలెత్తుతున్న సమస్యలు, సమన్వయ లోపంపై ఆలోచించి పరిష్కారమార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, వివిధ దేశాలతో జరుగుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల (కల్చరల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్) పురోగతిని కూడా జి.కిషన్ రెడ్డి సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement