Wednesday, March 29, 2023

అదానీ గ్రూప్‌కు కొనసాగుతున్న నష్టాలు.. కుబేరుల జాబితాలో 21వ స్థానానికి పడిపోయిన అదానీ

అదానీ గ్రూప్‌కు నష్టాలు కొనసాగుతున్నాయి. హిండెన్‌బర్డ్‌ నివేదిక తరువాత ఆరు ట్రేడింగ్‌ సెసెన్స్‌లో అదానీ గ్రూప్‌ కంపెనీల సంపద 8.76 లక్షల కోట్లు అవిరైంది. ఇందులో అధికంగా ఇన్వెస్టర్లు నష్టపోయారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 21వ స్థానానికి పడిపోయినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. శుక్రవారం నాడు ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు కొంత పుంజుకున్నప్పటికీ, మిగతా కంపెనీల షేర్ల పతనం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను స స్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్‌ అండ్‌ పీ డోజోన్స్‌ ప్రకటించింది. అందుకు అనుగుణంగా డోజోన్స్‌ సస్టైనబిలిటీ సూచికి ఫిబ్రవరి 7న సవరణ చేయనున్నట్లు తెలిపింది.

నెలరోజుల్లో 70 శాతం డౌన్‌

- Advertisement -
   

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సహా అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్‌ షేర్లను ఏఎస్‌ఎం ప్రేమ్‌వర్క్ లోకి తీసుకువచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. దీని ప్రకారం ఈ షేర్లలో ఇంట్రాడేలో ట్రేడ్‌ చేయాలంటే ట్రేడర్లకు ముందస్తుగా 100 శాతం మార్జిన్‌ అవసరం. దీని వల్ల కొంత మేర షార్ట్‌ సెల్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది. ఈ పరిణామాల మధ్య అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు శుక్రవారం నాడు నష్టాలతోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ 70 శాతం పతనమైంది. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్స్‌లో అదానీ గ్రూప్‌లోని స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన కంపెనీల సంపద 8.76 లక్షల కోట్లు అవిరైంది. శుక్రవారంనాటి నష్టాలను కూడా కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు మాత్రం దారుణంగా నష్టపోయారు.

దిద్దుబాటు చర్యలు…

అదానీ గ్రూప్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భారీగా షేర్ల పతనం కొనసాగుతున్నందున ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కొన్ని రుణాలను ముందుగానే చెల్లించి తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రుణదాతలతో అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతున్నది. అమెరికా డాలర్‌ బాండ్లకు అవసరమైన కూపన్‌ చెల్లింపులను అదానీ కంపెనీలు గురువారం నాడు గడువులోగా చెల్లించినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలకు సమాధానంగా ఓ క్రెడిట్‌ నోట్‌ను కూడా అదానీ గ్రూప్‌ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలోనే స్టాక్‌ మార్కెట్‌లో అదానీ ఎంటర్‌ప్రౖౖెజెస్‌ షేర్లు 30 శాతం నష్టం నుంచి కొలుకుని చివరకు 2 శాతం నష్టంతో సరిపెట్టుకున్నాయి.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పంతంలో సవరణలు

అదానీ పవర్‌తో 2017లో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో సవరణలు కోరినట్లు బంగ్లాదేశ్‌ వపర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. విద్యుత్‌ ధర చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని బంగ్లాదేశ్‌ స్పష్టం చేసింది. ఇదే జరిగితే అదానీ పవర్‌ షేర్లపై మరింత ప్రతికూల ప్రభావం పడనుంది.

నిధుల సమీకరణ ఇబ్బందే : మూడీస్‌

హిండెన్‌బర్గ్‌ కథనం నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ దీనిపై స్పందించింది. అదానీ గ్రూప్‌ మొత్తం ద్రవ్య లభ్యతను అంచనా వేస్తున్నామని తెలిపింది. ప్రస్తత పరిణామాల ఆ గ్రూప్‌ నిధుల సమీకరణకు అడ్డంకిగా మారనున్నాయని మూడీస్‌ తెలిపింది. రానున్న ఒకటి రెండేళ్లలో ముందుగా నిర్ధేశించుకున్న మూలధన వ్యయాలకు లేదా రుణాలు పునర్‌వ్యవస్థీకరించుకోవడం కష్టం కావొచ్చని అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు 2025లో చెల్లించాల్సిన రుణాలేవి లేవని మూడీస్‌ తెలిపింది. మూలధన వ్యయాల్లో కొన్ని వాయిదా వేయదగినవిగా గుర్తించినట్లు తెలిపింది.

మరో రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ కూడా దీనిపై స్పందించింది. అదానీ గ్రూప్‌ సంస్థలు, వాటి సెక్యూరిటీస్పై ఇప్పటికిప్పుడే ఎటువంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. నిధుల ప్రవాహం విషయంలో తమ అంచనాల్లో ఎలాంటి మార్పూలేదని పేర్కొంది. స్వల్ప కాలంలో ఈ గ్రూప్‌కు చెందిన ముఖ్యమైన ఆఫ్‌షోర్‌ మెచ్యూర్‌ బాండ్లు ఏవీ లేవని తెలిపింది. అదానీ గ్రూప్‌లో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పడు గమనిస్తున్నామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement